
జర్నలిస్టులపై కేసుల నమోదు దారుణం
● ఏపీయూడబ్ల్యూజే జేఏసీ నిరసన
ఆత్మకూరు: రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ, విక్రయాల నేపథ్యంలో షాపుతోపాటు బెల్టుషాపుల సమీపంలోనే మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడాన్ని వార్తగా రాసిన ‘సాక్షి’ బ్యూరోఇన్‌చార్జి, ఎడిటర్‌పై పోలీసు కేసులు నమోదు చేయడం దారుణమని ఏపీయూడబ్ల్యూజే జేఏసీ ఖండించింది. విచారణ పేరుతో వేధించడం గర్హనీయమని పేర్కొంది. సోమవారం ఆత్మకూరు డివిజన్ పరిధి లోని అన్ని పత్రికలు, చానళ్ల విలేకరులు ఇటీవల జరిగిన పరిణామాలపై సమావేశం నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ విలేకరుల ఎప్పుడూ ప్రజాపక్షానే ఉంటారని, ప్ర జల నుంచి తెలుసుకున్న సమాచారాన్నే వార్తలుగా ఇస్తున్నారన్నారు. వార్తల్లో తప్పిదాలు ఉంటే ఖండన ఇవ్వాలి తప్ప వెంటనే కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘సాక్షి’ విషయంలో పోలీసులు తదుపరి చర్యలకు దిగితే తాము మౌనంగా ఉండబోమని జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.