
శిక్షణ సరే.. కుట్టు మెషీన్లేవీ..?
దుత్తలూరు: ఉచిత శిక్షణ...పూర్తి చేసుకున్న వారికి కుట్టుమెషీన్లతో పాటు సర్టిఫికెట్లను అందజేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. దీంతో జిల్లాలోని 31 కేంద్రాల్లో 1250 మంది మహిళలు శిక్షణ పొందారు. ట్రెయినింగ్ పూర్తయినా, మెషీన్లు పంపిణీకి నోచుకోవడంలేదు. మూడు నెలలు గడుస్తున్నా, ఇదే పరిస్థితి. బీసీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని బీసీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన పేద మహిళలకు శిక్షణ పేరిట హడావుడి చేశారు. మెషీన్లు వస్తాయి.. ఉపాధి పొందొచ్చని ఆశపడిన మహిళలకు నిరాశే ఎదురవుతోంది. వాస్తవానికి శిక్షణకు సంబంధించిన అర్హులు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని మున్సిపల్ కమిషనర్లతో పాటు ఎంపీడీఓలకు పంపారు. నిబంధనల మేరకు 18 నుంచి 60 ఏళ్లలోపు వారిని శిక్షణకు ఎంపిక చేశారు.
సిబ్బందికి అందని వేతనాలు
ఒక్కో శిక్షణ కేంద్రానికి ఒక టీచర్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించారు. టీచర్‌కు నెలకు రూ.15 వేలు.. కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.12 వేల చొప్పున వేతనాన్ని మంజూరు చేయాలి. మూడు నెలలకు గానూ ఒక నెలకే వేతనాలను అందజేశారని సమాచారం. మిగిలిన మొత్తం ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో 1250 మంది మహిళలకు ట్రెయినింగ్
నేటికీ ఎదురుచూపులు
ప్రగల్భాలకే కూటమి నేతల పరిమితం
పంపిణీ చేస్తాం
జిల్లాలోని 31 కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఐదు చోట్ల ట్రెయినింగ్ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కుట్టుమెషీన్లను అందజేస్తాం. సిబ్బంది వేతనాలకు సంబంధించిన బిల్లులను అప్‌లోడ్ చేస్తున్నాం.
– నిర్మలాదేవి,
బీసీ కార్పొరేషన్ ఈడీ