
లాడ్జిలో అగ్నిప్రమాదం
● నెల్లూరులో అర్ధరాత్రి ఘటన
● 15 మందిని రక్షించిన పోలీస్,
ఫైర్ సిబ్బంది
● తప్పిన పెనుముప్పు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): అందరూ గాఢ నిద్రలో ఉండగా, లాడ్జిలో అగ్నిప్రమాదం శనివారం అర్ధరాత్రి సంభవించింది. ఈ హఠాత్పరిణామంతో గదుల్లో ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. దర్గామిట్ట పోలీసుల కథనం మేరకు.. కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని బ్లూ మూన్ లాడ్జి రెండో అంతస్తులో గల 102వ గదిలో ఏసీ షార్ట్ సర్క్యూటైంది. శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జరిగిన ఘటనలో గదిలోని ఫర్నిచర్, పరుపులు, దిండ్లు దగ్ధమయ్యాయి. మంటలతో అదే అంతస్తులోని మిగిలిన గదుల్లోకి పొగ దట్టంగా వ్యాపించింది. ఇదే సమయంలో వివిధ గదుల్లో 15 మంది ఉన్నారు. సెన్సార్ సిస్టమ్ ఉండటంతో తలుపులు తెరుచుకోకపోవడంతో కిటికిల్లోంచి చేతులు ఊపుతూ పెద్దగా కేకలేశారు. గమనించిన కొందరు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ వెంటనే చేరుకొని, మంటలు ఆర్పి.. కిటికీ అద్దాలు, తలుపులను పగలగొట్టి 15 మందిని ఎమర్జెన్సీ ద్వారం మీదుగా తీసుకొచ్చారు. ఓ బాలుడ్ని అంబులెన్స్‌లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్క్యూ ఆపరేషన్‌ను ఎస్పీ అజిత స్వయంగా పర్యవేక్షించారు. పొగను పీల్చడంతో ఆస్పత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు. కాగా లాడ్జిని విశ్రాంత ఏఎస్పీ పమిడి మధుసూదన్‌రావుకు చెందిందిగా గుర్తించారు. ఫైర్, రెస్కూ టీమ్ అధికారులు చంద్రశేఖర్, శ్రీనివాసులు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

లాడ్జిలో అగ్నిప్రమాదం

లాడ్జిలో అగ్నిప్రమాదం