
మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలి
నెల్లూరు(అర్బన్): మహిళల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు కృషి చేయాలని పలువురు వైద్యులు పేర్కొన్నారు. విష్ 2025 ఉమెన్స్ ఇన్‌ఫెర్టిలిటీ సర్జరీ హార్మోన్ అనే అంశంపై చెముడుగుంట సమీపంలోని స్రిడ్స్ ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు ఆదివారంతో ముగిసింది. నెల్లూరు మెనోపాజ్ సొసైటీ, ఆబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లైవ్ ఎండోస్కోపీ వర్క్‌షాపును నిర్వహించారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో సీ్త్రలకు సంబంధించిన అత్యంత క్లిష్టతరమైన ఆపరేషన్లను సదస్సుకు హాజరైన డాక్టర్లు స్క్రీన్ ద్వారా పరిశీలించి పలు అంశాలపై చర్చించారు. జాతీయ స్థాయి డాక్టర్లు పరీక్షిత్ టాంక్, ప్రతాప్, పళని అప్పన్, అర్చనాబేసర్, అంజూసోనీ, అనితాషా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు పల్లంరెడ్డి యశోదర మాట్లాడారు. సీ్త్రల ఆరోగ్య రక్షణ, ఆధునిక చికిత్సలను నాణ్యమైన విధంగా అందించేలా నెల్లూరులో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించడాన్ని అభినందించారు. ఆర్గనైజింగ్ టీమ్ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్లు ఉషా, అపూర్వ, మిథిలశ్రీ, సాయిదీప్తి తదితరులు పాల్గొన్నారు.