
కొనసాగుతున్న కార్మికుల పోరాటం
● ఎన్‌ఎంసీ కార్యాలయం ఎదుట
రోడ్డుపై బైఠాయింపు
● డీఆర్సీ సమావేశానికి హాజరైన
మంత్రులను కలిసే ప్రయత్నం
● కొందరు నాయకులు, కార్మికులను
అడ్డుకున్న పోలీసులు
నెల్లూరు(బారకాసు): పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను ఉపసంహరించుకోవాలంటూ బుధవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో పెద్దఎత్తున నగరంలోని దర్గామిట్ట ప్రాంతంలోని బారాషహీద్ దర్గా వద్దకు కార్మికులు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కమిషనర్ నందన్‌ను అడ్డుకుని తమ సమస్యలను పరిష్కరించాలని యూనియన్ నాయకులు, కార్మికులు నిలదీశారు. దీంతో కమిషనర్ తన పరిధిలో లేదని చెప్పగా అయితే వెళ్లనిచ్చేది లేదన్నారు. దీంతో ఆయన వెనుదిరిగారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఆఫీస్‌లో డీఆర్సీకి హాజరైన మంత్రులను కలిసేందుకు కార్మికులు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కె.పెంచలనరసయ్య, కొందరు నాయకులు, కార్మికులను వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో వారిని విడుదల చేయకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని కార్మికులు డీఆర్సీ వద్దకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు ఆపి పదిమందిని లోపలికి పంపించడం జరిగింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఇదే సమావేశానికి హాజరైన మంత్రి నారాయణను కలిసి వినతిపత్రం అందించారు. నారాయణ మాట్లాడుతూ ఇది రాష్ట్రవ్యాప్త పాలసీ కాబట్టి సీఎంతో మాట్లాడి చెబుతామన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రక్రియను వెంటనే ఆపాలని, లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కొండా ప్రసాద్, కత్తి శ్రీనివాసులు, సుజాతమ్మ, మాలకొండయ్య, జి.నాగేశ్వరరావు, సూర్యనారాయణ, సుధాకర్, వజ్రమ్మ, కామాక్షమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు.