
కావలి కాలువలో మృతదేహం
దగదర్తి: మండలంలోని మబ్బుగుంటపాళెం సమీపంలో ఉన్న కావలి కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జంపాని కుమార్ కథనం మేరకు.. సంగం మండలం తరుణవాయి గ్రామానికి చెందిన తిరుపతయ్య (75) గురువారం మధ్యాహ్నం కావలి కాలువ పక్కనే ఉన్న తన పొలంలో పనికి వెళ్లాడు. అతను ఇంటికి తిరిగి రాలేదని, కాలువలో పడి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ సంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మబ్బుగుంటపాళెం సమీపంలో ఉన్న కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దానిని పోలీసులు బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.