
స్నేహితులే హంతకులు
పొదలకూరు: ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఏర్పడిన గొడవలను మనసులో పెట్టుకుని నెల్లూరు రూరల్ మండలం యనమలదిన్నె గ్రామానికి చెందిన ఓ యువకుడిని స్నేహితులే అంతమొందించారు. మాట్లాడుకుందామని పిలిచి మద్యం తాగించి దారుణంగా కత్తులు, రాడ్లు, పారతో దాడి చేసి హతమార్చి ఇసుకలో మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. పోలీసుల కథనం మేరకు.. యనమలదిన్నెకు చెందిన కె.మోహన్ చందు (21)కు పొదలకూరు మండలం విరువూరుకు చెందిన తరుణ్‌కుమార్‌రెడ్డితో స్నేహం ఉంది. చందు కార్ల కంపెనీలో పనిచేసేవాడు. రెండు కార్లు అమ్మకాలకు రావడంతో తరుణ్‌కు ఇప్పించాడు. అయితే వాటికి సంబంధించిన నగదును అతను ఇవ్వలేదు. ఒక కారు అమ్ముకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో చందు, తరుణ్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈనెల 10వ తేదీన రాత్రి తరుణ్ మరికొందరితో కలిసి చందును విరువూరు రావాలని ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడుకుందామని పిలిచాడు. చందు వెళ్లగా మాటలు కలిపి పెన్నా వద్ద ఫూటుగా మద్యం తాగించి హత్య చేశారు. మృతదేహాన్ని ఇసుకలోనే పాతిపెట్టి వెళ్లిపోయారు. చందు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. సోమవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో రూరల్, పొదలకూరు సీఐలు వేణు, శివరామకృష్ణారెడ్డిలు తహసీల్దార్ బి.శివకృష్ణయ్య సమక్షంలో మృతదేహాన్ని వెలికితీయించారు. ఫోరెన్సిక్ వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
యువకుడి దారుణ హత్య
విరువూరు పెన్నా ఇసుకలో పూడ్చివేత
ఆర్థిక వ్యవహారాలే కారణం

స్నేహితులే హంతకులు