పోలీసులకు భారీగా మామూళ్లు | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు భారీగా మామూళ్లు

Jul 16 2025 3:27 AM | Updated on Jul 16 2025 3:27 AM

పోలీస

పోలీసులకు భారీగా మామూళ్లు

కందుకూరు: ఉలవపాడు మండలం రామాయపట్నం, చాకిచర్ల, గుడ్లూరు మండలం తెట్టు ప్రాంతాల్లో రోజూ ఏదో ఒకచోట పెద్ద ఎత్తున పేకాట శిబిరాన్ని మంత్రి నారా లోకేశ్‌ మనుషులు నిర్వహిస్తున్నారు. ఐదారు నెలలుగా రోజూ అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు జరుగుతోంది. కందుకూరు, సింగరాయకొండ, కావలి, ఒంగోలు, నెల్లూరు, చైన్నె, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లు తరలివస్తున్నారు. 25 నుంచి 30 మంది పాల్గొంటున్నారు. రోజూ రూ.కోటికి పైగా చేతులు మారుతున్నట్లు సమచారం. ఒక్కొక్కరు రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు. కోతముక్క, కోసు వంటి వివిధ రకాల ఆటలు నిర్వహిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేసి శిబిరం నిర్వహిస్తుండటం గమనార్హం. ఆడేవారి నుంచి నిర్వాహకులు ప్రత్యేకంగా ఎంట్రీ ఫీజులు తదితరాల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అన్ని ఖర్చులు పోను శిబిరం నిర్వాహకులకు ఆదాయం రోజుకు రూ.లక్షల్లో ఉంటోంది.

సకల ఏర్పాట్లు

పేకాటరాయుళ్లకు ఏ లోటు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనిని చాకిచర్ల, పెదపట్టపుపాళేనికి చెందిన ఇద్దరు వ్యక్తులకు అప్పగించారు. మద్యం, భోజనాలు శిబిరం వద్దకు సరఫరా చేస్తారు. వీరు గ్రామంలో స్థానిక నాయకులు కావడంతో అడ్డు చెప్పకుండా కొంత ఆదాయం వచ్చేలా ఈ కాంట్రాక్ట్‌ను అప్పజెప్పారు. కొందరికి గంజాయిని అందిస్తుండటం విశేషం.

ప్రత్యేకంగా తరలిస్తూ..

శిబిరంలో పాల్గొనే వారిని తరలించేందుకు నిర్వాహకులు ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే జాతీయ రహదారిపై ఉన్న తెట్టు వరకే కారులో రావాల్సి ఉంటుంది. అక్కడ పార్కింగ్‌ చేస్తే నిర్వాహకులు బైక్‌లపై అడవుల్లో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలిస్తారు. ముగిసిన తర్వాత బైక్‌లపై తీసుకెళ్లి కార్ల వద్ద వదిలేస్తారు. అదే సందర్భంలో పేకాట శిబిరం వద్దకు బయట వ్యక్తులు రాకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా పెట్టారు. స్థానికంగా ఉండే 10 నుంచి 15 మంది యువకులను నియమించారు. వీరు అటు వైపు ఎవరైనా వస్తున్నారేమోనని నిఘా ఉంచుతారు. కొత్త వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే నిర్వాహకులను చెబుతున్నారు. దీనికి గానూ ఒక్కొక్కరికి రోజుకు రూ.2,000 ఇస్తున్నారు.

కందుకూరు నియోజకవర్గంలో

అధికార పార్టీ నేతల శిబిరం

రోజూ రూ.కోటికి పైగా చేతులు

మారుతున్న వైనం

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి

వస్తున్న పేకాటరాయుళ్లు

మద్యం, విందు ఏర్పాట్లు

బయట వ్యక్తులు రాకుండా కాపలా

ఇంత జరుగుతున్నా పేకాట శిబిరం గురించిన సమాచారం పోలీసులకు తెలియదా అంటే కచ్చితంగా తెలుసు. ఎవరు నిర్వహిస్తున్నారు?, ఏ ప్రాంతంలో ఏ రోజు ఆట జరుగుతుంది? అనే పక్కా సమాచారం ముందుగానే వారికి చేరుతుంది. అయినా ఆ వైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణం మామూళ్ల మత్తులో జోగుతుండటమే. గుడ్లూరు, ఉలవపాడు పోలీసులకు రోజుకు రూ.30 వేలు మామూళ్లు ఈ శిబిరం నుంచి వెళ్తున్నట్లు సమాచారం. ఈ కారణంతోనే చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అదే సందర్భంలో ఎక్సైజ్‌ శాఖ అధికారులను కూడా మేనేజ్‌ చేసుకుంటున్నారు. కాగా ఆదివారం అర్ధరాత్రి పరకొండపాడు గ్రామానికి చెందిన తూమాటి లక్ష్మయ్య (49) అనే వ్యక్తి పేకాట శిబిరానికి వెళ్తుండగా కారు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బ తింటున్నాయి. నేడు ప్రాణాల మీదకు వస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

పోలీసులకు భారీగా మామూళ్లు 1
1/1

పోలీసులకు భారీగా మామూళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement