
ప్రమాణాలు పాటించని హోటళ్లపై చర్యలు
నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ నిర్దేశించిన ప్రమాణాలను నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు తప్పక పాటించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంహెచ్‌ఓ చైతన్య స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వివిధ రెస్టారెంట్లు, హోటళ్లను ఆకస్మికంగా ఆదివారం తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్‌లు, ఎన్‌ఓసీని పరిశీలించారు. వంటశాలల్లో నిర్వహణ తీరును పర్యవేక్షించారు. తయారీదారులు, సర్వర్ల వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. హోటళ్లలో ప్రమాణాలను మెరుగుపర్చేలా నోటీసులను జారీ చేయాలని ఆదేశించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహనను పెంపొందించుకొని, వస్త్ర సంచులనే వినియోగించాలని కోరారు. నెల్లూరు నగరపాలక సంస్థ, ఆహార ప్రమాణాల భద్రత సంస్థల ఆధ్వర్యంలో తనిఖీలను త్వరలో నిర్వహించనున్నామని వెల్లడించారు.