
సర్కారు బడి.. కార్పొరేట్ పెత్తనం
వీఆర్ హైస్కూల్‌ను మున్సిపల్ హైస్కూల్‌గా మార్పు చేసి పునః ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన సుమారు రూ.9 కోట్ల సీఎస్సార్ ఫండ్‌తో పాఠశాల భవనాలను, ప్రాంగణాన్ని ఆధునికీకరించారు. సర్కారు స్కూల్‌ను కార్పొరేట్ పెద్దలు తమ కబంధహస్తాల్లోకి తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ ఈ పాఠశాలపై అజమాయిషీ బాధ్యతలను తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే తన విద్యా సంస్థల్లో పని చేసే సిబ్బందిని, బోధకులను నియమించడంతోపాటు విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. తన పాఠశాలల్లో కేటాయించాల్సిన ఫ్రీ సీట్లను ఈ పాఠశాలకు మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు (టౌన్): సర్కారు బడిపై కార్పొరేట్ మంత్రి నారాయణ పెత్తనం, ఆయన సాగిస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజల కోసం వెంకటగిరి రాజా కుటుంబీకులు వీఆర్ విద్యా సంస్థలను ప్రారంభించారు. ప్రస్తుతం వీఆర్ విద్యా సంస్థల వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే మంత్రి నారాయణ కోర్టు వివాదంలో ఉన్న వీఆర్ ఎయిడెడ్ హైస్కూల్‌ను వీఆర్ మున్సిపల్ హైస్కూల్‌గా మార్పు చేస్తూ ప్రతిపాదనలు పంపించగా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల భవనాలతోపాటు ప్రాంగణాన్ని అధునాతనంగా తీర్చిదిద్దేందుకు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం దాదాపు రూ.9 కోట్ల మేర సీఎస్సార్ ఫండ్స్‌ను ఖర్చు చేసింది. గత నెల 30వ తేదీన వీఆర్ హైస్కూల్‌లో తరగతులను అనధికారికంగా ప్రారంభించారు. సోమవారం రాష్ట్ర విద్యాశాఖా మంత్రి లోకేశ్‌తో అధికారికంగా ప్రారంభించనున్నారు.
సిటీ నియోజకవర్గానికే పరిమితం
మంత్రి నారాయణ తన నియోజకవర్గం పరిధిలో ఉందన్న కారణంతో పాఠశాలలో కేవలం సిటీ నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకే అడ్మిషన్లు పరిమితం చేశారనే విమర్శలు వినిస్తున్నాయి. దీంతో జిల్లా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వీఆర్ హైస్కూల్ పక్కనే ఉన్న గడియారం స్తంభం వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధి ఉంది. అయితే ఆ నియోజకవర్గానికి చెందిన కేవలం 35 నుంచి 50 మంది విద్యార్థులకు మాత్రమే మొక్కుబడిగా అడ్మిషన్లు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీఆర్ హైస్కూల్‌లో అడ్మిషన్లు జిల్లా వ్యాప్తంగా కల్పించాల్సి ఉన్నా కేవలం సిటీ నియోజకవర్గానికే పరిమితం చేయడంపై పలువురు విద్యావేత్తలు, ప్రజలు మండి పడుతున్నారు.
వీఆర్‌లో నారాయణ సిబ్బంది నియామకం
వీఆర్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల నియామకానికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు ఉండాలి. అయితే సచివాలయాల్లో పని చేస్తున్న క్వాలిఫైడ్ స్కూల్ అసిస్టెంట్లను 20 మంది వరకు నియమించారు. ప్రస్తుతం 8 మంది స్కూల్ అసిస్టెంట్లు, 10 ఎస్జీటీలను నియమించారు. మరో 15 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఐదుగురు ఎస్జీటీలు, ఇద్దరు హెడ్‌మాస్టర్లు కావాలని విద్యాశాఖకు లేఖ పంపించారు. వీరితోపాటు నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే మరో 25 మందికి పైగా సిబ్బందిని బోధన, బోధనేతర విభాగాల్లో నియమించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా వలంటీర్‌ను నియమించాలన్న ప్రభుత్వ అనుమతి ఉండాల్సి ఉంది. అయితే ఇవేమి పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారులు మంత్రికి ఇష్టం వచ్చిన వారిని అనధికారికంగా నియమిస్తున్నారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ అయినా అనుభవం లేకపోతే బోధన ఏ విధంగా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వీఆర్ హైస్కూల్‌ను
మున్సిపల్ హైస్కూల్‌గా మార్పు
పునః ప్రారంభానికి ఎన్‌సీసీ కంపెనీ రూ.9 కోట్ల సీఎస్సార్ ఫండ్స్
అంతా నారాయణ సిబ్బందిదే
అజమాయిషీ
ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే నారాయణ పాఠశాల బోధకుల నియామకం
నేడు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో
ప్రారంభం
టీడీపీ నేతల సిఫార్సులకే అడ్మిషన్లు
విద్యాహక్కు చట్టం 12/1సీ కింద జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి పేద పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పించాల్సి ఉంది. అయితే జిల్లాలో ఏ కార్పొరేట్ పాఠశాలతోపాటు నారాయణ విద్యా సంస్థల్లో కూడా ఉచిత ప్రవేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల విద్యాహక్కు చట్ట ప్రకారం నారాయణ స్కూల్స్‌ల్లో అడ్మిషన్లు ఇవ్వడం లేదని చాలా మంది తల్లిదండ్రులు కలెక్టర్ ఆనంద్‌కు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఇటువంటి కొంత మంది విద్యార్థులకు వీఆర్ పాఠశాలలో అడ్మిషన్లు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికి సైతం అడ్మిషన్లు కల్పించారని తెలిసింది. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల వ్యవహారాలను నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది, ఆయా డివిజన్లల్లో ఉండే పార్టీ ఇన్‌చార్జిలకు అప్పగించినట్లు తెలిసింది. వీరితోపాటు పేరుకు ఒకరిద్దరు సచివాలయ సిబ్బందిని కూడా నియమించారు. మొత్తం మీద 1 నుంచి 9వ తరగతి వరకు 1,050 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు.
జిల్లాలో అందరికీ అడ్మిషన్లు ఇవ్వాలి
జిల్లాలోని నిరుపేదలకు వీఆర్ హైస్కూల్‌లో అడ్మిషన్లు ఇవ్వాలి, కేవలం సిటీ నియోజకవర్గానికే పరిమితం చేయడం సరికాదు. విద్యాహక్కు చట్టం ప్రకారం వీఆర్ హైస్కూల్‌లో బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలి. ప్రైవేట్ స్కూల్స్‌ల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించడం లేదు. మంత్రి లోకేశ్ చర్యలు తీసుకోవాలి.
– నరహరి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ పేరెంట్స్ అసోసియేషన్
అడ్మిషన్లతో మాకు సంబంధం లేదు
వీఆర్ హైస్కూల్‌లో అడ్మిషన్ల వ్యవహారం పూర్తిగా సచివాలయ సిబ్బంది చూసుకున్నారు. ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో నియమిస్తాం. సచివాలయాల్లో పని చేసే క్వాలిఫైడ్ అసిస్టెంట్లను కొంత మందిని తీసుకున్నాం. వీఆర్ హైస్కూల్ ఇన్‌చార్జిగా జాకీర్‌హుస్సేన్‌నగర్ హెచ్‌ఎం నారాయణకు బాధ్యతలు అప్పగించాం.
– బాలాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి

సర్కారు బడి.. కార్పొరేట్ పెత్తనం