
నిఘా నీడన రొట్టెల పండగ
నెల్లూరు(క్రైమ్): పోలీస్, సీసీ కెమెరాల నిఘా నీడన ఆదివారం బారాషహీద్ దర్గాలో రొట్టెల పండగ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. 1,700 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ నిమిత్తం స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో మహిళా సిబ్బందిని ఏర్పాటు చేశారు. మూడు పీటీజెడ్ కెమెరాలు, 67 సీసీ కెమెరాలు, పది డ్రోన్లను ఏర్పాటుచేసి పోలీసు అవుట్ పోస్టులోని తాత్కాలిక కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశారు. పోలీసు అధికారులు అక్కడి నుంచి పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు, సలహాలిచ్చారు. అవుట్ పోస్టు సిబ్బంది తప్పిపోయిన 28 మంది చిన్నారులను సంరక్షించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. క్రైమ్ పార్టీ సిబ్బంది ఓ జేబుదొంగను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సాయంత్రం ఎస్పీ జి.కృష్ణకాంత్, కలెక్టర్ ఒ.ఆనంద్‌తో కలిసి దర్గా ఆవరణ, క్యూలైన్లు, రొట్టెల మార్పిడి తదితర ప్రాంతాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్‌రూమ్, సీసీ కెమెరాల పనితీరుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. క్యూలైన్లలోని భక్తులు వీలైనంత త్వరగా దర్శనం చేసుకునేలా చూడాలన్నారు. క్రైమ్ పార్టీలు నేరాలు జరగకుండా చూడాలన్నారు. నేర నియంత్రణ చర్యలపై పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా భక్తులకు తెలియజేయాలని సూచించారు.
దారి మూసేయడంతో..
రొట్టెల పండగ సందర్భంగా కొందరు పోలీసుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. దర్గా వైపు వెళ్లే రహదారులను అధికారులు బారికేడ్లతో మూసివేయడంతో పొదలకూరురోడ్డు సెంటర్, జేవీఆర్ కాలనీ, లక్ష్మీనరసింహపురం, అంబేడ్కర్ నగర్, బ్రహ్మానందపురం, బట్వాడిపాళెం సెంటర్ తదితర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ ఇళ్లు అక్కడేనని చెబుతున్నా వినిపించుకోకుండా వాహనాలు నిలిపివేశారు. దీంతో వారు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దర్గా ఆవరణలోనూ ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
పోలీసుల తీరుపై స్థానికుల అసహనం