
అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ఇబ్బందులు
నెల్లూరు(బారకాసు): బారాషహీద్ దర్గా ప్రాంగణమంతా బ్లీచింగ్, సున్నం చల్లాల్సి ఉంది. అయితే కొన్నిచోట్ల మాత్రమే చల్లుతూ మమ అనిపిస్తున్నారు. దీంతో అంటురోగాలు ప్రబలుతాయోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని ప్రదేశాల్లో బ్లీచింగ్, సున్నం ఎప్పటికప్పుడు చల్లుతూ ఉండాలి. అయితే దర్గా ప్రధాన రహదారిలో బ్లీచింగ్, సున్నం చల్లిన దాఖలాల్లేవు. సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరముంది.
క్వారీ డస్ట్ వల్ల..
దర్గా ప్రాంగణంలో ఎక్కడైతే సిమెంట్ రోడ్డు వేయలేదో ఆ ప్రాంతాల్లో క్వారీ డస్ట్ వేసి చదును చేశారు. అయితే డస్ట్‌పై నీరు చల్లడం మరిచిపోయారు. ఆదివారం ఉదయం నుంచి గాలి మొదలుకావడంతో డస్ట్ గాలికి ఎగిరి భక్తుల కళ్లలోకి చేరడంతో ఇబ్బంది పడ్డారు. స్టాల్స్‌లోనూ, దుకాణాల్లో తినుబండారాలపై డస్ట్ పడుతోంది. వాటిని కొనాలంటే భక్తులు వెనుకంజ వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత అధికారులు నీళ్లు చల్లించాలన్న ఆలోచన కూడా చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ఇబ్బందులు