
తల్లిని కాపాడబోయి..
పొదలకూరు: తనకు ప్రాణం పోసిన తల్లిని విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడబోయిన ఓ తనయుడు తనువు చాలించాడు. ఈ విషాదకరమైన ఘటన మండలంలోని మరుపూరు ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీకి చెందిన ఆర్.వంశీ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వివాహమై నెలల బాబు ఉన్నాడు. వంశీ తల్లి లక్ష్మమ్మ ఆదివారం ఉదయం ఇంట్లో పనులు చేసుకుంటూ వాషింగ్ మెషీన్‌కు ఉన్న విద్యుత్ తీగను గమనించకుండా తాకడంతో విద్యుదాఘాతానికి గురైంది. ఆమె కేకలు వేయడంతో నిద్రపోతున్న వంశీ వెంటనే లేచి అక్కడికి వెళ్లాడు. తల్లిని పట్టుకుని లాగేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు బాధితుడిని పొదలకూరు సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే వంశీ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. లక్ష్మమ్మ విద్యుదాఘాతంతో స్పృహ కోల్పోయినా ప్రాణాపాయం నుంచి బయట పడింది. తన ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో బిడ్డ చనిపోవడంతో లక్ష్మమ్మ, ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్ కేసునమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మరుపూరు ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది.
విద్యుదాఘాతానికి గురై తనయుడి
మృత్యువాత
మరుపూరులో విషాదం

తల్లిని కాపాడబోయి..