
ఆత్మాహుతికై నా సిద్ధమే.. భూములు మాత్రం ఇవ్వం
ఉలవపాడు: ఆత్మాహుతికై నా సిద్ధమే కానీ మా భూములు మాత్రం ఇవ్వమని మండలంలోని కరేడు రైతులు తేల్చి చెప్పారు. భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ శుక్రవారం కరేడులోని 1వ సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సేకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు వెల్లడించడానికి సుమారు 4 వేల మంది రైతులు తరలివచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. అభివృద్ధి అంటే ఏమిటని రైతులు ప్రశ్నించారు. మెట్ట భూములు ఉపయోగంలోకి తేవడం అభివృద్ధి అంటారన్నారు. సస్యశ్యామలంగా ఉన్న భూములను తీసుకుంటే అభివృద్ధి ఎలా అవుతుందని, వ్యవసాయమే లేకుండా చేస్తారా అని నిలదీశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మా భూములివ్వాలా అని అధికారులను ప్రశ్నించారు. తాము మాత్రం భూములివ్వడానికి అంగీకరించమని తేల్చి చెప్పారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా భూ సేకరణ చేస్తున్నామన్నారు. రైతుల సమస్యలు 100 శాతం పరిష్కరించలేమని, కానీ వారికి అన్నీ అందించాలని కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. సబ్ కలెక్టర్ శ్రీపూజ మాట్లాడుతూ రైతుల సహకారంతోనే భూ సేకరణ చేస్తామన్నారు. చివరకు ఎలాంటి తీర్మానం లేకుండానే సభను ముగించారు.
రైతులకు అన్యాయం జరిగితే
ఊరుకునేది లేదు: ఎమ్మెల్సీ తూమాటి
కరేడు రైతులకు ఏ మాత్రం అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హెచ్చరించారు. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా ఒక్క ఎకరా కూడా తీసుకోలేరన్నారు. కరేడు రైతులందరూ చిన్న, సన్న కారు రైతులు వారు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్లు. వారికి అండగా ఉంటామన్నారు. కంపెనీలు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. కానీ ఎక్కడ ఇచ్చారో చూపాలన్నారు. రామాయపట్నం పోర్టు అరబిందో కంపెనీ కడుతుంటే ప్రభుత్వం మారగానే నవయుగకు అప్పగించారన్నారు. అక్కడి ఉద్యోగులను తొలగించారని, కంపెనీలు ఉద్యోగాల కల్పనను పాటించడం లేదన్నారు. భూ సేకరణ జరగాలంటే ప్రజలను సంతృప్తి పరచి చేయాలి. రైతులు తమ నిర్ణయాన్ని తెలియజేశారని, వారికి అండగా ఉంటామన్నారు. రాస్తారోకోలో రైతులు తమ బాధను వెలిబుచ్చడానికి ఆందోళన చేస్తే వారిపై కేసులు పెట్టారని, వాటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరేడు గ్రామ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భూ సేకరణకు వ్యతిరేకంగా అర్జీ అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సురేష్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
తేల్చి చెప్పిన కరేడు గ్రామస్తులు
బీడు భూములు కాకుండా.. పచ్చని భూములు తీసుకుంటారా?
మూడు వేలకు పైగా అభ్యంతర అర్జీలు
రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్సీ తూమాటి

ఆత్మాహుతికై నా సిద్ధమే.. భూములు మాత్రం ఇవ్వం

ఆత్మాహుతికై నా సిద్ధమే.. భూములు మాత్రం ఇవ్వం