
వైద్యులను అరెస్ట్ చేయడం దుర్మార్గం
నెల్లూరు (అర్బన్): విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం దుర్మార్గమని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సునీల్ అన్నారు. యువ వైద్యుల అరెస్ట్‌ను నిరసిస్తూ బుధవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరికి ఆ సంఘం నాయకులు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి విదేశాల్లో చదివి పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ అయిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌ను పర్మినెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇవ్వమని కోరారన్నారు. గత 13 నెలలుగా రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం వచ్చిన యువ వైద్యులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నగర అధ్యక్షుడు ఆశిర్, నాయకులు చరణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.