
అత్తమామల హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కావలి(జలదంకి): ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు ఏసీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో అత్తమామలను హత్య చేసిన ఏలూరు వెంగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం కావలి డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ పి.శ్రీధర్ వివరాలు వెల్లడించారు. వెంగయ్యకు వెంకాయమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. చేపల వేట, చిల్లకర్ర కొట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వెంగయ్య అత్తమామలు చలంచర్ల కల్లయ్య (62), చలంచర్ల జయమ్మ (59)లు వారింటి సమీపంలోనే ఉంటూ మేకలు కాస్తున్నారు. వెంగయ్య నిత్యం మద్యం మత్తులో ఉండేవాడు. అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం వెంగయ్య భార్యను పిట్టల వేటకు రమ్మని పిలవగా రాలేనని చెప్పింది. వేటకు వెళ్లి వచ్చిన అతడికి భార్య వేరేవారితో చేపల వేటకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో వెంగయ్య భార్యపై మరింత అనుమానం పెంచుకుని ఫూటుగా మద్యం తాగాడు. అనంతరం భార్య తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉండగా అక్కడికి వెళ్లాడు. మచ్చు కత్తితో వెంకాయమ్మ వీపుపై నరికాడు. కుమార్తెను కాపాడాలని కల్లయ్య, జయమ్మ అడ్డు వెళ్లారు. వెంగయ్య భార్యను వదిలేసి అత్తమామలను కత్తితో విచక్షణారహితంగా నరికి చంపాడు. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి వెంగయ్య కోసం గాలించారు. అతడిని లక్ష్మీపురం శివారులోని మిద్దెలబోడు కొండ – రామస్వామికుంట వద్ద బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కలిగిరి సీఐ వెంకట్రావ్, దుత్తలూరు, ఉదయగిరి ఎస్సైలు ఆదిలక్ష్మి, ఇంద్రసేనారెడ్డి, సిబ్బందిని అభినందించారు.