
93.83 శాతం పింఛన్ల పంపిణీ
నెల్లూరు (పొగతోట): జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 3,04,034 మందికి పింఛన్ల నగదు అందజేయాల్సి ఉండగా 2,85,261 మందికి పంపిణీ చేశారు. నగరంలోని పొదలకూరు రోడ్డు లోని గౌతమీనగర్‌లో దివ్యాంగురాలు భానుశ్రీకి కలెక్టర్ ఓ ఆనంద్ నగదు అందజేశారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ అరుణ నియామకం
● తిరస్కరించిన డాక్టర్
నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సిద్ధానాయక్ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్‌ఏసీ) సూపరింటెండెంట్‌గా పెద్దాస్పత్రిలోని పల్మనాలజీ విభాగం హెచ్‌ఓడీ, ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అరుణను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను ఆమె తిరస్కరించారు. తాను ఆ బాధ్యతలు చేపట్టలేనని డీఎంఈకు విన్నవించారు.
పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం
నెల్లూరు రూరల్: రొట్టెల పండగ ఏర్పాట్లలో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో రొట్టెల పండగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి ఐదు రోజులపాటు జరిగే రొట్టెల పండగకు గతంలో కంటే ఎక్కువగా భక్తులు విచ్చేస్తారని, అందుకనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. స్వర్ణాల చెరువులో సరిపోయే నీటిని ఉంచాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలాల వద్ద, ఇతర అవసరమైన చోట మొబైల్ టాయిలెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. మెడికల్ టీంలను, అంబులెన్స్‌లను సన్నద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రొట్టెల పండగ ఏర్పాట్లలో భాగమయ్యే వివిధ శాఖల సిబ్బందికి ఆయా రోజుల్లో ఎటువంటి సెలవులు మంజూరు చేయొద్దని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జేసీ కార్తీక్, ఏఎస్పీ సౌజన్య, మున్సిపల్ కమిషనర్ నందన్, ఆర్డీఓ అనూష, విద్యుత్, ఇరిగేషన్ ఎస్‌ఈలు విజయన్, దేశ్‌నాయక్, డీఎంహెచ్‌ఓ సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

93.83 శాతం పింఛన్ల పంపిణీ