
వృద్ధుల ఆచూకీ కోసం గాలింపు
సోమశిల: మల్లెంకొండ అటవీ ప్రాంతంలో తప్పిపోయిన వృద్ధులు కోటపాటి రత్నయ్య, కోటపాటి సుబ్బయ్య నాయుడుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మంగళవారం సోమశిల ఎస్సై అనూష, అనంతసాగరం ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి, పొదలకూరు ఎస్సై హనీఫ్ ఆధ్వర్యంలో స్పెషల్ ఫోర్స్, రెవెన్యూ అధికారులు, కుటుంబ సభ్యులు ఇతర వ్యక్తులతో చిలకలమర్రి మల్లెంకొండ శిలల వద్దకు వెళ్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 40 మంది వెళ్లారు. అయినా అన్నదమ్ముల ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్మగ్లర్ల చేతిలో చిక్కుకున్నారా అనే అనుమానంతో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఎస్సై అనూష మాట్లాడుతూ వృద్ధుల ఆచూకీ తెలిపితే రూ.10 వేల పారితోషికం అందిస్తామన్నారు.