
పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ..
బోగోలు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అబ్దుల్ జహీర్ అక్రమాలకు పాల్పడ్డాడని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బోగోలు గ్రామ మాజీ ఉప సర్పంచ్ మద్దిబోయిన వీర రఘు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా జమ ఖర్చులు అడిగామన్నారు. దీనికి కార్యదర్శి ఇచ్చిన సమాధానంతో అక్రమాలకు పాల్పడినట్లుగా తెలిసిందన్నారు. తాగునీటి వసతి కోసం సుమారు రూ.7 లక్షలు, పారిశుధ్య సామగ్రి కొనుగోలుకు రూ.4 లక్షలు, ప్రత్యేక పారిశుధ్య పనుల కోసం రూ.4,47,300, ట్రాక్టర్ డీజిల్ కోసం రూ.2,27,752, గ్రామసభలు స్వర్ణ పంచాయతీ, షామియానాల పేరుతో రూ.1.60 లక్షలు ఖర్చు చేసినట్లుగా చెప్పారన్నారు. ప్రైవేట్‌గా పనిచేస్తున్న దేవరపల్లి మనోహర్ ద్వారా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అతడి బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అదేవిధంగా సర్పంచ్ వద్ద ప్రతి పనికీ లంచం తీసుకుంటున్నారని తెలిపారు. సర్పంచ్ భర్త పందిపాటి ఉదయ్‌కుమార్, కార్యదర్శి బ్యాంక్ లావాదేవీలను పరిశీలించాలని కోరారు.