
‘ఉపాధి’ బకాయిల విడుదలకు డిమాండ్
● ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ
కార్మిక సంఘం ధర్నా
నెల్లూరు రూరల్: ‘కూటమి ప్రభుత్వం బీజేపీకి వంత పాడుతూ ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలి’ అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి క సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూలీలకు పనులు కల్పిస్తామని చెప్పి 60 శాతం పనులను యంత్రాలతో చేయించడానికి తీర్మానాలు చేశారన్నారు. ప్రస్తుతం కూలీలతో కేవలం 40 శాతం పనులు కూడా గ్రామాల్లో చేయించడం లేదన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. పని ప్రదేశాల్లో నిబంధనలను పాటించడం లేదని, ఏదైనా ప్రమాదం జరిగినా కనీసం మెడికల్ కిట్ కూడా ఉంచడం లేదన్నారు. జిల్లాలో 12 వారాలకు సంబంధించి బకాయిలున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకమరాజు, ప్రధాన కార్యదర్శి మంగళ పుల్లయ్య, నాపాల వెంకటేశ్వర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు.