
కెరటమై ఎగిసిన కర్షకాగ్రహం
ఉలవపాడు: ‘మండలంలోని తీర ప్రాంతం కరేడు కర్షకుల ఆగ్రహం కడలి కెరటమై ఎగిసి పడింది. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్ట్‌లు, రహదారుల నిర్బంధాలు రైతులను ఆపలేకపోయాయి. పోలీసులు ఎక్కు పెట్టిన తుపాకులకు, ఝుళిపించిన లాఠీలకు ఒక్కొక్కరు.. ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజులై గర్జించారు. వేలాది మంది రైతు కుటుంబాలతో తరతరాలుగా వ్యవసాయ భూములతో ముడిపడిన బంధాలను, భావోద్వేగాలను కాదని కంపెనీలకు కట్టబెట్టే ప్రభుత్వ నిరంకుశత్వాన్ని దునుమాడుతూ మండలంలోని కరేడు రైతులు సాగించిన తొలి ఉద్యమాన్ని విజయవంతం చేసి పాలకులకు వణుకు పుట్టించారు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే పంట భూములే తమ జీవనాధారమని, అటువంటి భూములను తమ నుంచి తీసుకోవాలంటే, ముందుగా ప్రాణాలు తీసి శవాలపై వచ్చి తీసుకెళ్లాంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండోసోల్ కంపెనీ కోసం భూసేకరణకు వ్యతిరేకంగా ఆదివారం మండలంలోని కరేడు కర్షకుల పోరు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. వందల మంది పోలీసులు భారీగా మోహరించి అడ్డంకులు పెట్టినా చేధించుకుని సాగించిన రైతులు తమ భూముల కోసం ఎందాకై నా పోరాడతారని చాటారు.
ఊహించని రీతిలో..
జాతీయ రహదారిపై కరేడు రైతులు పార్టీలకు అతీతంగా ఏకమై చేపట్టిన రాస్తారోకో విజయవంతం కావడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి ఏకంగా 8,348 ఎకరాలు కేటాయించడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. భూమి లేకపోతే తమకు జీవనాధారం లేదనే పరిస్థితికి రైతులు రావడంతోనే రాస్తారోకో భారీగా జరిగింది. సుమారు 2 వేల మంది రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. 800 మందికి పైగా మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొనడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తమ శవాల మీద వెళ్లి భూములు తీసుకోవాలని మహిళా రైతులు నినాదాలు చేయడం విశేషం. దాదాపు 20 నిమిషాల పాటు రైతులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. సబ్‌కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తాత్కాలికంగా భూసేకరణ వాయిదా వేసి రైతులు సమస్యలు పరిష్కరిస్తామని హామీతో విరమించారు. భూసేకరణపై ఇంత మంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారని ఎవరూ ఊహించలేకపోయారు.
రైతులకు పెరుగుతున్న మద్దతు
భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు బయట నుంచి మద్దతు పెరుగుతోంది. పోలీసులు తమ గోడును చెప్పకుండా అడ్డుకోవడంతో వారు చేసిన పోరాటం పలువురిని కదిలించింది. వామపక్షాలు, రైతుకూలీ సంఘాలు మరింతగా ఈ పోరాటానికి సహకరించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్ర రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కరేడులో పర్యటించనున్నారు. ఆమ్‌ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీసీవై పార్టీలు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. కరేడులో మాత్రం పార్టీకతీతంగా రైతులే నాయకత్వం వహిస్తూ అన్ని పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్లేషకులు సైతం కరేడు రైతుల ఉద్యమం గురించి మాట్లాడడం విశేషం. ఈ కంపెనీకి 8,348 ఎకరాలు కేటాయించడం పై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కూటమి నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత...
కరేడు భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తొలుత బీపీసీఎల్‌కు ఇస్తారని ప్రచారం జరిగింది. తర్వాత మార్చి 25 న ఇండోసోల్‌కు కేటాయిస్తున్నట్లు జీఓ ప్రకటించారు. జూన్ 19న భూసేకరణ చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చి తీసుకునే భూముల రైతుల వివరాలు ప్రచురించారు. అందులో 4 వేల ఎకరాలకు వివరాలు ప్రకటించారు. నోటిఫికేషన్ వెలువడడంవతో ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన మొదలైంది. ఉద్యమ బాట పట్టారు. తమ భూములు కోల్పోకుండా ఉండడం కోసం ‘సేవ్ కరేడు’ పేరుతో భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ రైతు ఉద్యమంతో ప్రభుత్వంపై కరేడు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అర్థమవుతుంది.
భూ సేకరణ ఆగేనా
కరేడు రైతులు భూ సేకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఎగసిపడి విజయవంతమైంది. భూ సేకరణను నిలుపుదల చేయగలమనే విశ్వాసం ఏర్పడింది. పచ్చని పంట పొలాలు సుమారు 3 వేల ఎకరాలు, మామిడి తోటలు 1000 ఎకరాలు, సపోట తోటలు, 2 వేల ఎకరాలు, వేరుశనగ 2 వేల ఎకరాలు మిగిలిన భూములు జామాయిల్, కూరగాయల సాగు కలిసి ఉన్నాయి. ఇంత సారవంతమైన భూములను, అన్నం పెట్టే భూములను తీసుకోవడం దారుణమని రైతులు అంటున్నారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అంచనాలకు మించి రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచన చేసి భూసేకరణ ఆపుతుందా.. మొండిగా ముందుకు సాగుతుందా తదుపరి పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో వేచి చూడాల్సి వస్తుంది.
పోలీసుల అణచివేత కుట్ర
రైతుల పోరును అణచివేయడానికి పోలీసులు శతధా ప్రయత్నిస్తున్నారు. పోలీసులతో తోపులాట జరిగిన తరువాత కూడా రైతులు పోలీసు బంధనాలు అధిగమించి రాస్తారోకో చేయడంతో రైతులపై పోలీసులు భారీ చర్యలకు సన్నద్ధమయ్యారు. రాస్తారోకోలో పాల్గొన్న రైతులు 26 మందితోపాటు సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సమీకరణకు సహకరించేలా చేశారని మరో 13 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కేసుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాస్తారోకో సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరును ప్రజాసంఘాలు, వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.