
జగనన్న పర్యటనను ఆపలేరు
● కుట్రలు, కుతంత్రాలను చీల్చుకుని అభిమన్యుడిగా వస్తాడు
● తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, మాజీమంత్రి అనిల్,
వైఎస్సార్‌సీపీ నేతలు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను ఎవరూ అడ్డుకోలేరని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జిల్లా జైల్లో ఉన్న మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు 3న నెల్లూరుకు వచ్చే జగనన్న పర్యటనను అడ్డుకునేందుకు అధికారులు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలను చీల్చుకుని అభిమన్యుడిగా వచ్చి తీరుతాడని చెప్పారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, కాకాణి కుమార్తె కాకాణి పూజితలతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం, అధికారులు ప్రయత్నించడం దారుణమన్నారు. హెలిప్యాడ్ కోసం 3, 4 స్థలాలను నాయకులు పరిశీలించారని, అడ్డంకులు, సాకులు చెబుతూ ఆ స్థలాలను అనుమతించకపోవడం దారుణమన్నారు. ఎప్పుడూ ఈ ప్రభుత్వమే ఉండదని, అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. జగనన్న మీద రాజకీయ కక్షతో హైడ్రామాలు చేయాల్సిన అవసరం లేదని, ఇలా పర్యటనను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. సంవత్సరంలోనే ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారని, ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ఎక్కువ రోజులు ఉండవన్నారు.
● మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ 10 రోజుల నుంచి జగనన్న పర్యటనకు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటికి హెలిప్యాడ్ అనుమతి విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. జగనన్న పర్యటన అంటేనే కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయయో అర్థం కావడం లేదన్నారు. రెండున్నర కి.మీ. సెక్యూరిటీ ఉండే విధంగా గుర్తించిన హెలిప్యాడ్‌పై అధికారులకు క్లారిటీ లేకపోవడం వారి భయాందోళలను తెలియజేస్తుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతాన్ని ఎంచుకున్నప్పటికీ అధికారు లు మరో ప్రాంతాన్ని చూపించడం, మూడు రోజుల నుంచి కాలయాపన చేయడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా 3వ తేదీ జగనన్న నెల్లూరుకు రావడం తథ్యమన్నారు.
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తూరులోని సెయింట్‌యాన్స్ స్కూల్, కాకుటూరు లో మరో స్థలాన్ని హెలిప్యాడ్‌కు కేటాయించాలని అధికారులను కోరినప్పటికి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. సెయింట్‌యాన్స్ స్కూల్ యాజమాన్యాన్ని అధికార పార్టీ నేతలు బెదిరించి జగనన్న పర్యటనకు అడ్డంకులు సృష్టించారన్నారు. జైలుకు సమీపంలో ముళ్ల పొదలు, హైటెన్షన్ ఎలక్ట్రికల్ వైర్లు ఉండి అప్రోచ్ రోడ్డు లేని స్థలాన్ని చూపిస్తూ అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు. షరతులతో సెంట్రల్ జైలు వద్ద స్థలం చూపడం సరైన పద్ధతి కాదన్నారు. జగనన్న వస్తుంటే ముందుగానే కాకాణిపై పీటీ వారెంట్ పెట్టి కోర్టుకు తరలిస్తారనే అనుమానం కూడా కలుగుతుందన్నారు. రాష్ట్రంలో మాజీ సీఎంకే స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. జగనన్న పర్యటనను అడ్డుకునే ఆలోచనతో కూటమి నేతలు ఉన్నారన్నారు. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతల్లో భయం కనిపిస్తుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజాక్షేత్రంలోకి రావాలంటే భయం పుడుతుందన్నారు.