ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకై నా సిద్ధమే | - | Sakshi
Sakshi News home page

ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకై నా సిద్ధమే

Jul 1 2025 3:58 AM | Updated on Jul 1 2025 3:58 AM

ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకై నా సిద్ధమే

ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకై నా సిద్ధమే

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణపట్నం లాజిస్టిక్స్‌ చెక్‌పోస్టు ద్వారా బలవంతంగా నగదు వసూలు చేసినట్లు ఏ ఒక్క ఆధారం చూపించినా ఏ శిక్షకై నా తాను సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలీస్‌ అధికారులకు సవాల్‌ విసిరారు. ముత్తుకూరు బీసీ కాలనీకి చెందిన షేక్‌ ఫరీద్‌బాబు జూన్‌ 7వ తేదీ ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ–1గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఏ–2గా మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ–3గా తూపిలి శ్రీధర్‌రెడ్డి, ఏ–4గా స్వామి బాలాజీ ట్రాన్స్‌పోర్టు, ఏ–5గా టాటా వెంకట శేషయ్య, ఏ–6గా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు ప్రసాద్‌, ఏ–7గా రాగా వెంకటేశ్వర్లు, ఏ–8గా పొట్టి రాజా, ఏ–9గా సాయికిరణ్‌తోపాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు. అప్పటికే జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న కాకాణిని పీటీ వారెంట్‌ కింద తీసుకెళ్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీకి కావాలని పోలీసులు కోరగా, రెండు రోజులకు అనుమతి ఇస్తూ న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కృష్ణపట్నంపోర్టు సీఐ రవినాయక్‌, ముత్తుకూరు ఎస్సై విశ్వనాథరెడ్డి జిల్లా సెంట్రలో జైల్లో ఉన్న కాకాణిని తమ కస్టడీకి తీసుకుని జిల్లా జైలు పక్కనే నెల్లూరు డిస్ట్రిక్ట్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో విచారణ చేపట్టారు. తొలిరోజు పోలీసులు 52 ప్రశ్నలు సంధించారు. పోలీస్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ సమక్షంలో కాకాణి సమాధానాలు ఇచ్చారు.

పోలీసులు: కృష్ణపట్నం లాజిస్టిక్స్‌ చెక్‌పోస్టు ద్వారా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి ద్వారా మీకు చేరినట్లుగా మా దర్యాప్తులో తేలింది. ఈ డబ్బులను మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్‌ చేశారా? ఎక్కడైనా డిపాజిట్‌ చేశారా? మీకు ఎంత మొత్తం వచ్చిందో తెలిపాలి?

కాకాణి: నాకు ఏ ఒక్క పైసా చేరినట్లు మీ దగ్గర సాక్షాధారాలు ఉంటే చూపించండి. నేను ధైర్యంగా చెబుతున్నాను. ఏ రూపంగా అయినా ఎవరి దగ్గర నుంచి అయినా ఒక్క నయాపైసా అయినా ముట్టినట్లు రుజువులు చూపిస్తే.. నేనే న్యాయాధికారి దగ్గరకెళ్లి ఎటువంటి విచారణ అవసరం లేకుండా నేను శిక్షార్హుడనని ఏ శిక్ష విధిస్తారో విధించమని వారికి విజ్ఞప్తి చేస్తాను.

పోలీస్‌ : కృష్ణపట్నం కంటైనర్స్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ గురించి మీ వద్ద ఉన్న సమాచారం చెప్పండి.

కాకాణి : నాకు ఎలాంటి సంబంధం లేదు. కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించిన తప్పుడు కేసు తప్ప మరొకటి కాదు. కేవలం తప్పుడు ఫిర్యాదులు తీసుకుని కేసు కట్టడం తప్ప ఇంకోటి కాదు. పోలీసుల విచారణ జరిపి ఆధారాలు బయట పెడితే ఎలాంటి శిక్షకై నా నేను సిద్ధమే.

పోలీస్‌ : ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్‌ గోపాలనగరానికి చెందిన ద్వారం రామిరెడ్డితో మీకున్న పరిచయం చెప్పండి.

కాకాణి : ఎలాంటి పరిచయం లేదు. పేరు కూడా వినలేదు. మీరు చెప్పిన వారందరిని రెండు రోజుల కస్టడీ సమయంలో నా ఎదురుగా ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

తొలిరోజు పోలీసుల కస్టడీ

విచారణలో కాకాణి సవాల్‌

మొదటి రోజు విచారణ పూర్తి

నెల్లూరు (లీగల్‌): మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ముత్తుకూరు పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మొదటిరోజు విచారణ పూర్తయింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముత్తుకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జిల్లా కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న కాకాణిని న్యాయవాది నందగమ శ్రావణ్‌కుమార్‌, మధ్యవర్తులుగా ముత్తుకూరు మండలం పంటపాళెం వీఆర్వో గండవరం భక్తవత్సలరెడ్డి, ముత్తుకూరు వీఆర్వో బాలు వెంకటరమణయ్య సమక్షంలో విచారించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కాకాణిని కేంద్ర కారాగారానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement