
అనుమానమే పెనుభూతమై..
దుత్తలూరు: దుత్తలూరు ఏసీ కాలనీ ఆదివారం అర్ధరాత్రి హత్యల కలకలంతో ఉలికి పడింది. మద్యం మత్తులో భార్యపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి సాగించిన మారణకాండ ఇది. కాలనీలో నివాసముంటున్న ఏలూరు వెంగయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యపై పెంచుకున్న అనుమానం అతనిలో మనిషిని మృగాన్ని చేసింది. భార్యను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఉన్న వెంగయ్య ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లాడు. అప్పటికే భార్య వెంకాయమ్మ సమీపంలోని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన వెంగయ్య కట్టెలు కొట్టడానికి ఉపయోగించే పదునైన మచ్చుకత్తి వెంట తీసుకొని అత్తామామల ఇంటికి వెళ్లాడు. తన భార్యను చంపేస్తానంటూ వీరంగం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్తామామలు చలంచర్ల జయమ్మ (60) కల్లయ్య (65)లను కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా భార్య వెంకాయమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గాయాలతో బయటపడి కింద పడిపోయింది. పెద్ద కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గట్టిగా నియంత్రించడంతో వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తితో పరారయ్యాడు. గాయపడిన వెంకాయమ్మను ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్సైలు ఆదిలక్ష్మి, రఘునాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్‌టీం ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు వెంగయ్య కోసం స్థానికంగా, సాంకేతకంగా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పుడుపడితే అప్పుడు పల్లెల్లో మద్యం దొరకడం వల్లే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
భార్యపై అనుమానంతో హత్యాయత్నం
మద్యం మత్తులో విచక్షణారహితంగా కత్తితో దాడి
అడ్డుకోబోయిన అత్త, మామలు హతం
భార్య పరిస్థితి విషమం
హత్యలతో ఉలికి పడిన దుత్తలూరు
భార్యపై అనుమానమే పెనుభూతమైంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసింది. అడ్డుకోబోయిన అత్త, మామల ప్రాణాలు తీసింది. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో దుత్తలూరు ఒక్కసారిగా ఉలికి పడింది. పల్లెల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలే ఈ ఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.