
స్టాఫ్ నర్సు ఆత్మహత్యాయత్నం
సెల్ఫీ వీడియోలో పలువురిపై ఆరోపణలు
ఆత్మకూరు: ఏఎస్‌పేటలోని ప్రాథమిక వైద్యశాలలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి ఆదివారం సాయంత్రం పాల్పడ్డారు. ఆస్పత్రి డాక్టర్లతో పాటు 35 మంది సిబ్బంది, డీఎంహెచ్‌ఓ వేధింపులకు గురిచేస్తున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు.
విధులకు హాజరుకాకుండానే పలువురు సిబ్బంది పూర్తి జీతాలు తీసుకున్నారని.. తాను సెలవడిగితే డ్యూటీ డాక్టర్ మంజూరు చేయకుండా వేధించారని పేర్కొన్నారు. వీటిపై అర్జీలను అందించేందుకు కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని వాపోయారు. కాగా ఈమె, భర్త.. ఏబీఎన్ చానల్ రిపోర్టర్ తీవ్ర వేధింపులకు గురిచేయడంతో అదే పీహెచ్‌సీలో ఎఫ్‌ఎన్‌ఓగా పనిచేస్తున్న దొరసానమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి శుక్రవారం పాల్పడి న విషయం తెలిసిందే. ఈమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాఫ్ నర్సు లక్ష్మి సైతం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి నెల్లూరు తరలించనున్నామని బంధువులు తెలిపారు. కాగా ఈ విషయమై డీఎంహెచ్‌ఓ సుజాతను సంప్రదించగా, తనకు ఇప్పుడే విషయం తెలిసిందని, పూర్తి స్థాయి విచారణను సోమవారం జరుపుతానని చెప్పారు.