
న్యాయమూర్తులకు శిక్షణ తరగతులు
నెల్లూరు (లీగల్): జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులకు కోర్టు హాల్‌లో నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమన్ని ఏపీ హైకోర్టు జడ్జి, నెల్లూరు జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసులురెడ్డి శనివారం ప్రారభించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి. శ్రీనివాస్ నోడల్ అధికారిగా మాజీ హైకోర్టు జడ్జిలు బి. శ్యామసుందర్, ఎం.సీతారామమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వర్క్ షాప్‌లో సెక్షన్ 9 సీపీసీ న్యాయపరిధి, చట్టంలో కేసులను విచారించి నిర్ణయించడానికి కోర్టు అధికారం, లోక్ అదాలత్‌పై సమీక్షా, సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా కోర్టుకు వచ్చే విభిన్న ప్రతిభా వంతులైన కక్షిదారుల సౌకర్యార్థం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అందజేసిన 18 ట్రైసైకిళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఓ ఆనంద్, మునిసిపల్ కమిషనర్ వైఓ నందన్, బ్యాంక్ అధికారులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ఏపీ జెన్కోలో ప్రమాదం
● కార్మికుడికి తీవ్రగాయాలు
ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం జరిగిన ప్రమాదంలో అవుట్‌సోర్సింగ్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మచిలీపట్నంకు చెందిన శివప్రసాద్ పదేళ్లుగా ఇక్కడ అవుట్‌సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా పని చేస్తుండగా ఈహెచ్‌పీ బ్రేకర్ పేలిపోవడంతో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని తోటికార్మికులు హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు.
నీకు చదువు రాదు..
టీసీ తీసుకెళ్లిపో
● ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడి నిర్వాకం
దుత్తలూరు: విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసి, తదనుగుణంగా తర్ఫీదు ఇచ్చి ఎదిగేందుకు కృషి చేయాల్సిన ఓ ఉపాధ్యాయుడే నీకు చదువురాదు.. టీసీ తీసుకుని వెళ్లిపో అంటూ ఓ విద్యార్థిని అవమానించిన ఘటన దుత్తలూరు ఏపీ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పాఠశాలలో హర్షవర్ధన్‌రెడ్డి 7వ తరగతి చదువుతున్నాడు. అయితే సైన్‌న్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజశేఖర్ శుక్రవారం విద్యార్థిని పిలిచి టీసీ తీసుకుని వెళ్లమన్నాను కదా మళ్లీ ఎందుకు వచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని తల్లికి ఫోన్ చేసి పాఠశాలకు వచ్చి మీ అబ్బాయి టీసీ తీసుకెళ్లాలంటూ హెచ్చరించారు. దీంతో విద్యార్థి మేనమామ శనివారం ప్రిన్సిపల్ సైమన్‌రావుకు ఫిర్యాదు చేయడంతో ఆయన విద్యార్థిని పిలిచి వివరాలు సేకరించారు. ఈ విషయమై ప్రిన్సిపల్‌ని వివరణ కోరగా ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నాడని విచారించి చర్యలు చేపడతామని తెలిపారు.

న్యాయమూర్తులకు శిక్షణ తరగతులు