
ఆవుల తరలింపును అడ్డుకున్న గోరక్షకులు
● జరిమానా విధించి వదిలేసిన ఎస్సై
● ఎస్పీకి ఫిర్యాదు
ఉలవపాడు: అక్రమంగా గోవులను లారీలో తరలిస్తుండగా గోరక్షకులు, బీజేపీ నేతలు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చీమకుర్తి నుంచి తిరుపతికి కారులో వెళ్తున్న బీజేపీ నేతలు గుండా శ్రీనివాసరావు, శివారెడ్డి, నరేష్‌కుమార్, సుబ్బారావులకు మన్నేటికోట అడ్డరోడ్డు సమీపంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనం కంటపడింది. దీంతో అడ్డుకుని పరిశీలించారు. గోవులతో సహా వాహనాన్ని, తరలిస్తున్న వారిని ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే గోవులను సరంక్షించడంతోపాటు అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్సై అంకమ్మ ఆ వాహనానికి రూ.2,200 జరిమానా వేసి ఆవులను తరలించే వాహనాన్ని వదిలేశారు. దీంతో వారు జరిమానా కట్టి వెంటనే గోవులను తీసుకుని వెళ్లిపోయారు. ఎస్సై వ్యవహరించిన తీరుపై సదరు బీజేపీ నేతలు ఎస్పీ కృష్ణకాంత్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. గోవులను గోశాలకు తరలించకుండా, ఇరుకుగా ఉన్న వాహనంలో తిరిగి పంపించడంతో పోలీసులపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.