ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి | - | Sakshi
Sakshi News home page

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి

Jun 28 2025 5:31 AM | Updated on Jun 28 2025 7:25 AM

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి

రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్‌పర్సన్‌ శిరీష

సైదాపురం: అక్రమ మైనింగ్‌దారుల వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్‌పర్సన్‌ పొట్టేళ్ల శిరీష యాదవ్‌ జిల్లా పోలీస్‌ ఉన్నత అధికారులను కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మైనింగ్‌ అధికారులతోపాటు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న కొందరు తమపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ప్రాణహాని తలపెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసిందన్నారు. నిరంతరం ఖనిజ సంపదను కొల్లకొడుతూ ప్రభుత్వ ఆదాయానికి అడ్డుపడుతున్న అక్రమార్కులపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టార్గెట్‌ చేశారని ఆరోపించారు. రక్షణ కల్పించాలని విన్నవించారు.

జిల్లా పరిషత్‌, కలెక్టరేట్‌ వాహనాల వేలం

నెల్లూరు రూరల్‌: నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్‌ కార్యాలయం, కలెక్టరేట్‌లో వాడుకలో లేని మారుతి సుజుకి, స్కార్పియో, ఇన్నోవా వాహనాలను వేలం వేయనున్నట్లు డీఆర్వో ఉదయభాస్కర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు నెల్లూరు నూతన జిల్లా పరిషత్‌ కార్యాలయములో వేలంపాట జరుగుతుందన్నారు. ధరావత్తు సొమ్ము రూ.10 వేలు చెల్లించాలన్నారు. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ నిర్ధారించిన ధరలకు వాహనాలను వేలం వేస్తామని తెలియజేశారు.

కసుమూరు దర్గా హుండీ ఆదాయం

రూ.44.17 లక్షలు

వెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలీ దర్గా హుండీ ఆదాయం రూ.44.17 లక్షలు వచ్చినట్లు ఈఓ షేక్‌ షరీఫ్‌ శుక్రవారం తెలిపారు. దర్గాలో మొత్తం 8 హుండీలు ఏర్పాటు చేశామన్నారు. రెండు ప్రధాన హుండీల్లో కానుకలను గురు, శుక్రవారాల్లో లెక్కించగా రూ.44.17 లక్షలు వచ్చాయన్నారు. మిగిలిన ఆరు హుండీల్లోని కానుకలను 15 రోజుల తర్వాత లెక్కిస్తామన్నారు.

ఉచితంగా నట్టల నివారణ మందు

నెల్లూరు(పొగతోట): గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ రమేష్‌ నాయక్‌ తెలిపారు. శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో నాలుగుసార్లు మందు పంపిణీ చేస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

వరికుంటపాడు: మండలంలోని రామాపురం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. వరికుంటపాడు పంచాయతీ పరిధిలోని ఆండ్రవారిపల్లికి చెందిన గాడి మాధవరెడ్డి (45) మోటార్‌బైక్‌పై తిమ్మారెడ్డిపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. అలాగే వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరు నుంచి రాజమండ్రికి కూరగాయల లోడుతో బొలెరో వాహనం వెళ్తోంది. రెండు వాహనాలు రామాపురం సమీపంలోని నక్కలగండి రిజర్వాయర్‌ కాలువ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మాధవరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement