
నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు
● ఆవేదనలో వెలుగు ఉద్యోగులు
సీతారామపురం: వెలుగు విభాగంలో ప్రభుత్వం చేపట్టిన సాధారణ, సర్దుబాటు పేరిట బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపించింది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ కక్ష సాధింపుతో బదిలీలు చేశారంటూ ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయినవారికి జిల్లాలో, కాని వారికి ఇతర జిల్లాలకు స్థానచలనం ఎలా చేస్తారని కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సర్దుబాటు ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా ఉందని పలువురు విమర్శిస్తుండగా, కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బదిలీలకు సంబంధించి సెర్ప్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయగా అందుకు విరుద్ధంగా జిల్లాలో బదిలీలు జరిగాయన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 23 ప్రకారం ఒకచోట ఐదేళ్లు సర్వీస్ పూర్తిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అయితే కేవలం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని సైతం ఇతర జిల్లాకు బదిలీ చేసినట్లు తెలిసింది. సర్‌ప్లస్ కాకపోయినా రాజకీయాలు చేసి ఐదుగురు ఏపీఎంలను పల్నాడు జిల్లాకు బదిలీ చేశారు. అంతంతమాత్రపు జీతాలతో అంత దూరం వెళ్లి విధులు ఎలా నిర్వహించాలంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటీ లిస్టును పక్కనపెట్టి చేపట్టిన బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డబ్బులిచ్చిన వారిని మినహాయింపు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుష ఏపీఎంలను పల్నాడు జిల్లాకు పంపారు. వీరంతా సెర్ప్ గైడ్‌లైన్స్ ప్రకారం బదిలీలకు అనర్హులు. వారు ముందస్తు దరఖాస్తు చేసుకోలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాకు బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్, ఎంపీడీఓలు, ఇతర మండల స్థాయి అధికారులకు సైతం జిల్లా స్థాయిలో బదిలీలు జరుగుతుండగా ఏపీఎంలకు మాత్రం జోనల్ స్థాయిలో స్థాన చలనం కలిగించడం గమనార్హం.