
మోడల్ ప్రైమరీ స్కూళ్లలో తాత్కాలిక మరమ్మతులు
నెల్లూరు(టౌన్): జిల్లాలోని 470 మోడల్ ప్రైమరీ స్కూల్స్‌లో ఆగస్టు చివరి నాటికి తాత్కాలిక మరమ్మతులను పూర్తి చేయనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయా స్కూళ్లలో 1,270 గదులు అవసరమని గుర్తించినట్లు చెప్పారు. పెద్ద రూమ్‌లను రెండు తరగతి గదులుగా ఏర్పాటు చేయడం, లేదా వరండాను రెండు తరగతి గదులుగా, మేజర్, మైనర్ రిపేర్లు, ఎలక్ట్రికల్ వర్క్స్, గ్రీన్ చాక్‌బోర్డు, డ్యూయల్ డెస్క్ తదితర పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ మెయింటెనెన్స్‌కు 2,571 ప్రభుత్వ పాఠశాలలకు రూ.2.88 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రస్తుతం రూ.54.77 లక్షలు విడుదల చేసినట్లు చెప్పారు. మిగిలిన నిధులు డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు చెప్పారు. గతంలో 42 స్కూల్స్ పీఎంశ్రీకు ఎంపికయ్యాయన్నారు. తాజాగా తోటపల్లిగూడూరు మండలం కోడూరులోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్, సంగంలోని ఏపీఎస్‌ఆర్‌డబ్ల్యూఆర్, ఉలవపాడులోని ఏపీ మోడల్ స్కూల్, అల్లూరు మండలంలోని అల్లూరుపేటలోని జెడ్పీహెచ్‌ఎస్‌లు ఎంపికై నట్లు తెలిపారు. జిల్లాలోని 10 కేజీబీవీల్లో రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈనెల 12 నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సీఆర్పీలు, అంగన్‌వాడీ టీచర్లు, సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ పాల్గొంటారని చెప్పారు. డ్రాప్‌బాక్స్‌లో 14,232 మంది ఉన్నారని, వారిని ఆయా పాఠశాలల్లో చేర్పించనున్నట్లు పేర్కొన్నారు.