
సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యోగులు
ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం గ్రామ రెవెన్యూ సహాయకులు, సచివాలయ సర్వేయర్లు
కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశారు.
నెల్లూరు(అర్బన్): గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలువురు వీఆర్‌ఏలు ఽఆందోళన నిర్వహించారు. బుధవారం నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా జరిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి అజయ్‌కుమార్ మాట్లాడుతూ వీఆర్‌ఏలు రెవెన్యూ శాఖలో అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నట్లు చెప్పారు. సెలవులు లేకుండా ఫుల్‌టైమ్ పనిచేస్తున్నా పార్ట్‌టైమ్ పేరుతో గౌరవ వేతనం ఇచ్చి సరిపెట్టడం దుర్మార్గమన్నారు. వీఆర్‌ఏల్లో దాదాపు 90 శాతానికి పైగా దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వారేనన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ఒక్క డీఏను కూడా ఆపేయడం సిగ్గు చేటన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా టైమ్ స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. జిల్లాలో ఇంటర్వ్యూ చేసి ఆపేసిన 32 మందికి వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ విజయకుమార్‌కి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లచ్చయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుర్గయ్య, భాస్కర్, సుబ్బయ్య, అంకయ్య, అమీర్, ఓబులేసు, షమీం, శీను, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సర్వేయర్ల పెన్‌డౌన్
నెల్లూరు రూరల్: సమస్యలపై వినతిపత్రాలు సమర్పించినా పరిష్కారం చూపకపోవడంతో పెన్‌డౌన్ చేసి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని సచివాలయ సర్వే ఉద్యోగులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఆదేశాల మేరకు రాష్ట్రాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు బీద లక్ష్మణానంద, వర్కింగ్ ప్రెసిడెంట్ అంకయ్య ఆధ్వర్యంలో ఉద్యోగులు నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదోన్నతులు కల్పించి బదిలీలు చేపట్టాలన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియను సీనియారిటీ ప్రతిపాదికన చేయాలన్నారు. ఫారెస్ట్‌లో, ముళ్లపొదల్లోకి వెళ్లి సర్వే చేస్తే రిస్క్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. గ్రామస్థాయి ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రొబెషనరీ డిక్లేర్ కాకుండా ఇప్పటి వరకు రూ.15 వేల జీతంతో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణం రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సూచనల మేరకు సర్వేయర్లందరూ 27వ తేదీ వరకు మాస్ క్యాజువల్ సెలవు పెట్టారన్నారు. మిగిలిన రెండు రోజులు విజయవాడలో జరిగే రిలే నిరాహారదీక్షలకు హాజరవుతామని తెలియజేశారు.

సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట