
అక్కా.. నేను చనిపోతున్నా..
● ఆత్మహత్యకు ముందు
వీడియోకాల్ చేసిన తమ్ముడు
నెల్లూరు సిటీ: చనిపోతున్నానంటూ అక్కకు తమ్ముడు వీడియోకాల్ చేసి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు కథనం మేరకు.. రూరల్లోని కొండ్లపూడి టిడ్కో గృహంలో వి.శ్రీహరి (25) నివాసముంటున్నాడు. ప్లంబిగ్ వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో కొంత కాలంగా శ్రీహరి కారు డ్రైవర్‌గా వెళ్తున్నాడు. అప్పుల బాధను తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం తన అక్కకు వీడియోకాల్ చేసి బతకాలని లేదని, చనిపోతానని చెప్పాడు. ఆందోళనకు గురైన ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. అతను ఇంటికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా శ్రీహరి అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించి చూడగా చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారును తప్పించబోయి..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దుత్తలూరు : ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి పక్కనే ఉన్న రాళ్లగుట్టపై పడటంతో తీవ్ర గాయాలై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని వెంగనపాళెం – తిమ్మాపురం రోడ్డు మార్గంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు బుధవారం వివరాలు వెల్లడించారు. వెంగనపాళేనికి చెందిన పోలుబోయిన శ్రీనివాసులు (55) మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని గొర్రెల మంద వద్దకు మోటార్‌బైక్‌పై బయలుదేరాడు. తిమ్మాపురం వైపు పొలాల్లోకి వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో పక్కనే ఉన్న రాళ్లగుట్టపై పడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని హుటాహుటిన వింజమూరు వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు.
కండలేరులో
34.433 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 34.433 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,580, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.