
వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని వేధించొద్దు
● కక్ష తీరకుంటే నాపై కేసులు పెట్టండి
● కాకాణి పూజిత
పొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు తమను అధికార పార్టీ వారు వేధింపులకు గురిచేయడంతోపాటు అక్రమ కేసులు పెడుతున్నట్టు వెల్లడిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె కాకాణి పూజిత అన్నారు. బుధవారం ఆమె పొదలకూరు విఘ్నేశ్వరాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. సంగంరోడ్డు సెంటర్‌లో ఉన్న తన తాత రమణారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు పీటీ వారెంట్లు పెట్టి జైల్లోనే ఉంచాలని చూస్తున్నారని, ఇందుకోసం అమాయకులైన పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా విడవకుండా కేసులు బనాయిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలుంటే తనపై కేసులు పెట్టుకోవాలని ఎలాంటి సంబంధం లేని కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లొద్దన్నారు. తమను నమ్ముకున్న వారిని వేధింపులకు గురిచేస్తే అండగా నిలబడి ఎంత దూరమైన వెళతామన్నారు. గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులు మీరు చేస్తే ప్రజలు ఆదరిస్తారని కేసులు పెట్టుకుంటూ పోతే అధికారం శాశ్వతంగా కాదన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ రత్నమ్మ, ఐటీ వింగ్ అధ్యక్షుడు రావుల ఇంద్రసేన్‌గౌడ్, ఎంపీటీసీలు జి.లక్ష్మీకల్యాణీ, జి.శ్రీనివాసులు, ఎస్‌కే అంజాద్, కేతు రామిరెడ్డి, నాయకులు బొడ్డు మాలకొండారెడ్డి, పి.అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.