
భర్త తీరు వల్లే భార్య ఆత్మహత్య
ఆత్మకూరు: పట్టణానికి చెందిన గొట్ల ప్రణవి (24) అనే వివాహిత భర్త తీరు వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. కాగా ప్రణవి భర్త, టీడీపీ నాయకుడు, దేవరాయపల్లి గ్రామ ఉప సర్పంచ్ అయిన గొట్ల మస్తానయ్య, అతడితో అక్రమ సంబంధం కొనసాగించిన మహిళను అరెస్ట్ చేయాలంటూ మృతురాలి సోదరుడు, సమీప బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రి గేటు వద్ద నిలిపి వారిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఎస్సైలు, పోలీసులు శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మస్తానయ్య తన ప్రియురాలితో కలిసి ఉండగా వీడియో కాల్ ద్వారా భార్య ప్రణవికి చూపుతూ మానసికంగా హింసించాడని బంధువులు ఆరోపించారు. ఆ సమయంలో భర్త చూస్తుండగానే ప్రణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. అయితే మస్తానయ్య ఏమీ తెలియనట్టు తన నివాసం పక్కనున్న వారికి ఫోన్లు చేశాడని, ప్రణవి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, చూసి చెప్పాలంటూ నటించాడన్నారు. కేసు నమోదు విషయంలో ఎలాంటి సంబంధం లేని మృతురాలి అత్త, ఆడపడచుల పేర్లను నమోదు చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ప్రమేయంతో మస్తానయ్యను అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు వారికి సర్దిచెప్పి పంపారు.
బలవన్మరణం కేసులో బంధువుల ఆరోపణ
భర్త వీడియోకాల్‌లో ఉండగానే
ఉరేసుకున్నట్లు వెల్లడి
అతను టీడీపీ నేత, ఉప సర్పంచ్