
వారిపై కఠిన చర్యలు తీసుకోండి
● జెడ్పీ చైర్‌పర్సన్
ఆనం అరుణమ్మ
నెల్లూరు(పొగతోట): మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇందుకూరుపేట మండలానికి చెందిన బాలికను చైర్‌పర్సన్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెల్‌ఫోన్ దొంగతనం చేసిందనే అనుమానంతో బాలికను చిత్రహింసలకు గురి చేయడం హేయమైన చర్య అన్నారు. మనం ఏ సమాజంలో ఉన్నామని ప్రశ్నించారు. అధునాతన టెక్నాలజీతో ముందుకెళ్తుంటే కొందరు మూఢనమ్మకాలు పాటిస్తున్నారన్నారు. ప్రజల్లో పూర్తిస్థాయిలో చైతన్యం రావాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, సీడీపీఓలు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.