
హామీలు నెరవేర్చడంలో కూటమి విఫలం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో బుధవారం నెల్లూరు ప్రాంత కార్యకర్తల వర్క్‌షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులు సంబరాలు చేసుకునే బదులు ఆత్మ పరిశీలన చేసుకుంటే భవిష్యత్‌కు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గతంలో స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తే ధ్వంసం చేయాలని చెప్పిన చంద్రబాబు, లోకేశ్‌లు నేడు రాష్ట్రంలో అదానీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, సర్వేసల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు కూడా వేశారని గుర్తు చేశారు. అమరావతి పేరుతో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపి వేయాలన్నారు. కార్యక్రమంలో నేతలు మూలం రమేష్, మోహన్‌రావు, మాదాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.