
మహిళలపై అఘాయిత్యాలు సహించం
● రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ
నెల్లూరు(పొగతోట): మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారు ఎటువంటి వారైనా, ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ హెచ్చరించారు. మంగళవారం ఆమె నెల్లూరుకు వచ్చారు. పలువురు బాధితులను పరామర్శించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందుకూరుపేట మండలంలో సెల్‌ఫోన్ చోరీ అనుమానంతో ఓ బాలికను చిత్రహింసలకు గురిచేసిన ఐదుగురిలో నలుగురిని గుర్తించి అరెస్ట్ చేశారన్నారు. కనుపర్తిపాడు ఘటనకు సంబంధించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మహిళలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో వన్‌స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తారన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, ఇందుకూరుపేట సీడీపీఓ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.