
బీసీ సంక్షేమ హాస్టళ్లు పెంచాం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్లను పెంచామని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిణి వెంకటలక్ష్మమ్మ తెలిపారు. దుత్తలూరులో హాస్టల్ మూసివేతపై మంగళవారం ఆమె వివరాలు వెల్లడించారు. దుత్తలూరు, వరికుంటపాడుల్లో హాస్టల్ భవనాలు పిల్లలు ఉండేందుకు అనుకూలంగా లేవని, అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటంతో తాత్కాలికంగా ఆపేశామన్నారు. ప్రైవేట్ భవనాలను వెతుకుతున్నామని, దొరికిన వెంటనే హాస్టళ్లను పునఃప్రారంభిస్తామన్నారు. అలా కానీ పక్షంలో విద్యార్థులకు అనువైన చోట్ల ఈ ఏడాది చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గతేడాది విద్యార్థుల సంఖ్య తగ్గడంతో 14 హాస్టళ్లను మూసివేశామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆత్మకూరు, సంగం, బుచ్చి, అక్కంపేట, వింజమూరు, కావలి, ఉదయగిరిలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లను మళ్లీ ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 230 మంది విద్యార్థులు కొత్తగా చేరారని, జూలై 15వ తేదీ వరకు అడ్మిషన్లు ఉంటాయన్నారు.