
నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత
● ఫీజు రీయింబర్స్‌మెంట్,
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ తదితర హామీలపై కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత గర్జించింది. హామీలను తుంగలో తొక్కిందంటూ యువతీ, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు కదం తొక్కారు. గత ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను ఊడగొట్టిందంటూ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
నెల్లూరు (అర్బన్)/ నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నిరుద్యోగ యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం పిలుపు మేరకు సోమవారం యువత కలెక్టరేట్ వద్దకు కదలి వచ్చింది. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాల హోరుతో కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. పాత జెడ్పీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నగర నియోజకవర్గ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తొలుత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున వినూత్నంగా రిక్షా తొక్కుతూ యువత పడుతున్న కష్టాలపై ప్రభుత్వ తీరును ఎత్తి చూపారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కూటమి హామీలు అమలు చేయాలంటూ డీఆర్వో ఉదయభాస్కర్‌రావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చారని, అధికారం చేపట్టాక వాటిని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అధికారం చేపట్టి ఏడాదైనా ఒక్క ఉద్యోగం కల్పించలేదన్నారు. తనకు ఓటేస్తే వలంటీర్లకు ఇస్తున్న జీతాన్ని రూ.10 వేలకు పెంచుతానని నమ్మబలికి అధికారం రాగానే రాష్ట్రంలోని 2.50 లక్షల మంది వలంటీర్లను వీధుల పాల్జేశారన్నారు. గతంలో తమ పార్టీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో వివిధ రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ పేరుతో వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. మద్యం షాపులను ప్రభుత్వ పరం చేసి నిరుద్యోగ యువతకు అక్కడ అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించారన్నారు. దేశమే గర్వించే రీతిలో సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పౌర సేవలు అందించేందుకు వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేశారన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో రాష్ట్రం పురోగమన దిశ నుంచి తిరోగమనం వైపు పరుగులు తీస్తుందన్నారు. కూటమి దాష్టీకాలు చూసి పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన పరిశ్రమల నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. ఏడాది కాలంలో చదువుకున్న ఒక్క విద్యార్థికి ఉద్యోగం రాలేదన్నారు. పారిశ్రామిక రంగం కుప్పకూలిపోతే, ప్రధానమైన వ్యవసాయం రంగం కూడా నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు లేదన్నారు. మద్యాన్ని ఏరులై పారించడంతో శాంతిభద్రతలు పాతాళానికి దిగజారిపోయాయన్నారు. జిల్లాలోనే 100 మందికి పైగా అభాగ్య మహిళలు, చిన్నారులు అత్యాచారాలకు గురయ్యారన్నారు. అంగన్‌వాడీలకు, ఆశ కార్యకర్తలకు రేషన్‌కార్డులు రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ఏడాది కాలంలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబును నమ్మి నిలువునా మోసపోయామని ప్రజలు గ్రహించారన్నారు. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు కసితో ఉన్నారన్నారు.
● యువజన విభాగం నాయకుడు, కార్పొరేటర్ వేలూరు మహేష్ మాట్లాడుతూ అలవి గాని హామీలివ్వడం వాటిని నీరుగార్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయన సీఎంగా కేవలం రూ.1000 మాత్రమే పింఛన్ పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. ఇప్పుడు పలువురు అర్హులకు కూడా పింఛన్ కోత పెట్టేందుకు శ్రీకారం చుడుతున్నాడని విమర్శించారు.
● వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ మాట్లాడుతూ ప్రశ్నించే యువతపై రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందన్నారు. అయినా తమ పోరాటం ద్వారా ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయించగలిగామన్నారు. సంవత్సరానికి ఒక్కొక్క నిరుద్యోగికి నిరుద్యోగభృతి కింద రూ.36 వేలు బాకీ ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మెడలు వంచి యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చేలా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని లోకేశ్ చెప్పారని, ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు.
● రాష్ట్ర యువజవన విభాగం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసం, జగన్‌అంటేనే నమ్మకం అన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం హామీలు గురించి ప్రశ్నించే వారి గొంతుకలను కూటమి ప్రభుత్వం నొక్కుతుందన్నారు. అయినా భయపడేది లేదన్నారు. మోసపోయిన విద్యార్థులు, యువత అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
● వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్‌లు తీసుకోలేక అల్లాడుతున్నారన్నారు.
● కావలి నియోజకవర్గ యువజన విభాగం నేత చైతన్య మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టగానే 1.25 లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. 2.50 లక్షల మందికి ఉపాధి చూపారన్నారు. చంద్రబాబు రాగానే ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నాడని విమర్శించారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అని చంద్రబాబు నిరూపించారన్నారు.
● వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో 140కి పైగా హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఏడాది 5 లక్షలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికే 4 లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు తొలగించిందని విమర్శించారు.
● కోవూరు వైఎస్సార్‌సీపీ నేత వీరి చలపతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో రూ.1.40 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఆ డబ్బుతో ఒక్క చోట కూడా అభివృద్ధి పనులు చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2 వేల కోట్ల బకాయిలున్నాయన్నారు. యువజన, విద్యార్థి నాయకులు అన్వేష్, మల్లి, యోగి మాట్లాడారు. యువత పోరు ఉద్యమానికి తరలివచ్చిన యువతీ, యువకులకు వైఎస్సార్‌సీపీ మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీసునంద, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఖలీల్ తదితరులు సంఘీ భావం తెలిపారు.
ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలెక్కడ
అంటూ ప్రభుత్వాన్ని నిలదీత
గత ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు ఊడగొడుతోందని మండిపాటు
పాత జెడ్పీ కార్యాలయం నుంచి
కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, ధర్నా
డీఆర్వో ఉదయభాస్కర్‌కు
వినతి పత్రం అందజేత

నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత

నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత

నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత

నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత

నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత

నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత

నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత

నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత