
గిరిజన బాలికకు నల్లపరెడ్డి పరామర్శ
● రూ.20 వేల ఆర్థిక సాయం అందజేత
కోవూరు: ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలో చిత్రహింసలకు గురై శరీరం అంతా కాలిన గాయాలతో నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలిక గంధళ్ల చెంచమ్మను మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరడంతోపాటు, బాధిత కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించి వారికి ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ చెంచమ్మపై జరిగిన దారుణం హృదయాన్ని కలిచి వేసింది. ప్రభుత్వం బాధితురాలికి అండగా నిలిచి రక్షణ కల్పించడంతోపాటు ఆమెకు న్యాయం జరగాలి. మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రసన్న వెంట జొన్నవాడ దేవస్థానం చైర్మన్, ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, ఏపీఎల్‌డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ తదితరులున్నారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–బీ, సీ
పోస్టులకు నోటిఫికేషన్
● 5వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలి
నెల్లూరు (టౌన్): కేంద్ర మంత్రిత్వశాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న భారత ప్రభుత్వ సంస్థల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో గ్రూప్–బీ, గ్రూపు–సీ పోస్టులకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఈఓ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీటీ), కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 సంబంధించి వచ్చేనెల 4వ తేదీలోపు దరఖాస్తు అందజేయాలని, 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలన్నారు. పరీక్ష ఆగస్టు 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్నట్లు చెప్పారు. పరీక్షకు సంబంధించిన పోస్టుల వివరాలు, వయో పరిమితి, ఫీజు వివరాలు, దరఖాస్తు చేసే విధానం, ఇతర వివరాలు ssc. gov. in వెబ్‌సైట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
విజయ డెయిరీ ఉద్యోగుల
పదవీ విరమణ వయస్సు పెంపు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు విజయ డెయిరీలో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ డెయిరీ పాలకమండలి సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వెంకటేశ్వరపురంలోని విజయ డెయిరీ కార్యాలయంలో చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఎంతో కాలంగా ఈ ప్రతిపాదన పాలక మండలి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నిర్ణయం తీసుకునే విషయంలో డెయిరీ ఆదాయ, ఖర్చులతోపాటు ఉద్యోగుల నియామకం, జీతభత్యాలు తదితర అంశాలపై కసరత్తు చేస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల వరకు పెంచుతూ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తీసుకున్న నిర్ణయానికి పాలకమండలి సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
కాకాణితో
ఎమ్మెల్సీలు ములాఖత్
వెంకటాచలం: కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సోమ వారం ములాఖత్ అయ్యారు. కూటమి ప్రభుత్వ కుట్రలతోపాటు, జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు.

గిరిజన బాలికకు నల్లపరెడ్డి పరామర్శ

గిరిజన బాలికకు నల్లపరెడ్డి పరామర్శ