
బీసీ హాస్టల్ మూసివేత
దుత్తలూరు: పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత విద్యా సంవత్సరం ప్రారంభంలోనే జిల్లాలో చాలా వసతి గృహాలను మూసివేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని మూసివేతకు సిద్ధమైంది. పేద విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు దశాబ్దాల క్రితం గత ప్రభుత్వాలు వసతి గృహాలను ఏర్పాటు చేశాయి. అయితే కూటమి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే దుత్తలూరులోని బీసీ బాలుర వసతిగృహాన్ని మూసివేసింది. ఈ వసతి గృహంలో మూడో తర గతి నుంచి 10వ తరగతి వరకు 44 మంది విద్యార్థులు వసతి పొందుతూ చదువుకుంటున్నారు. గతంలో ఇదే వసతి గృహంలో దాదాపు 150 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో చాలా మంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లి పోయి కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నా రు. తాజాగా విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలల తెరిచిన సమయంలో ముందస్తు సమాచా రం ఇవ్వకుండానే దుత్తలూరులోని వసతి గృహాన్ని మూసివేశారు. హాస్టల్‌కు వచ్చిన పిల్లలు ఎక్కడికి వెళ్లాలి.. ఎక్కడ ఉండి చదువుకోవాలనే సందిగ్ధంలో తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక్కడ వసతి గృహంపై కనీసం సమాచారం ఇచ్చేవారు కూడా లేకుండాపోయారు. హాస్టళ్లను ఎత్తివేసే దిశగానే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంటోందని పలువురు విమర్శిస్తున్నారు. దశాబ్దాలుగా నియోజకవర్గంలోనే ఎంతో పేరుగాంచిన ఈ బాలుర వసతిగృహాన్ని ఈ ఏడాది నుంచి ఎత్తివేయడంపై విద్యార్థు లు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయమై కావలి అసిస్టెంట్ బీసీ సంక్షేమాధికారి వెంకటేశ్వర్లును వివరణ కోరగా హాస్టల్ భవనం పూర్తిగా శిథిలమైందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్టల్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.