
కౌన్సెలింగ్‌లో ‘ప్రైవేట్’ ప్రలోభాలు
నెల్లూరు (టౌన్): పాలిసెట్ కౌన్సెలింగ్‌లో ప్రైవేట్ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ప్రతినిధులు ప్రలోభాలు మితిమీరాయి. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 21వ తేదీ నుంచి కౌన్సెలింగ్ జరుగుతోది. ఈ కౌన్సెలింగ్ కేంద్రం ముందు ఆది, సోమవారాల్లో శ్రీవెంకటే శ్వర ఇంజినీరింగ్ కళాశాల, గీతాంజలి కళాశాల బస్సులు తీసుకువచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ బస్సులకు ఇరు వైపులా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వారి ప్రతినిధులు నేరుగా కౌన్సెలింగ్ కేంద్రాల్లోకి వచ్చి తమ కళాశాలల్లో చేరితే మీకు గిఫ్ట్‌లతోపాటు ప్రయోజనాలు ఉంటాయని విద్యార్థులను ప్రలోభ పెడుతున్నారు. ఈ విషయం పాలిసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్, అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులు, కౌన్సెలింగ్ అధికారుల మధ్య లోపాయికారి ఒప్పందాల కారణంగానే ఈ విధంగా బాహాటంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కౌన్సెలింగ్ కేంద్రం పరిసరాల్లోకి ప్రైవేట్ కళాశాలల వాహనాలకు అనుమతి లేదు. అయినా ఆయా కళాశాలల ప్రతినిధులు నేరుగా కౌన్సెలింగ్ కేంద్రంలోకి వచ్చి ప్రచారం చేయడం చూస్తే ఎంతగా బరి తెగించారో అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతుండగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మాత్రం సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కేంద్రంలో ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులు ప్రచారాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇదే తంతు కొనసాగితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.