
వెల్లువలా వినతులు
నెల్లూరు రూరల్: నెల్లూరులోని కలెక్టరేట్‌లో ఉన్న తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, సర్వే రికార్డుల ఏడీ నాగశేఖర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ సమస్యలపై జాప్యం లేకుండా వెంటనే సమస్యల్ని పరిష్కరించాలన్నారు. మొత్తం 399 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 142, మున్సిపల్ శాఖవి 39, సర్వేవి 44, పంచాయతీరాజ్ శాఖవి 32, పోలీసు శాఖవి 39 తదితరాలున్నాయి.
పేదల భూముల ఆక్రమణ
నెల్లూరులోని వేదాయపాళెం చంద్రమౌళి నగర్‌లో సర్వే నంబర్ 78/2లో గతంలో పేదలకిచ్చిన ప్రభుత్వ భూమిని రిటైర్డ్ ఉద్యోగి పోగుల విజయసేన్ కుమార్ నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించి బిల్డింగ్ నిర్మించి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని చేకూరి సురేష్ అనే వ్యక్తి వినతిపత్రమిచ్చాడు. ఈ విషయమై అనేకసార్లు నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
నష్టాలు ఎదుర్కొంటున్నాం
40 ఏళ్లుగా కేబుల్ టీవీ వ్యాపారాన్ని జీవనోపాధిగా చేసుకున్నాం. ప్రస్తుతం వచ్చిన విప్లవాత్మక మార్పులతో ఎల్‌సీఓలు ఉనికి కోల్పోయి ఆర్థికంగా అనేక నష్టాలను ఎదుర్కొంటున్నాం. డిజిటలైజేషన్ తర్వాత కేబుల్ టీవీని ట్రాయ్ రెగ్యులేటరీ చట్టం కిందకు తీసుకువచ్చారు. దీంతో ప్రజలు అధిక చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. చార్జీలు పెంచకుండా నిలుపుదల చేయాలి. అదే సమయంలో ఎల్‌సీఓలను కూడా ట్రాయ్ పరిధిలోకి తీసుకొచ్చి బ్రాడ్‌కాస్టర్‌లు, ఎంఎస్‌ఓలతోపాటు కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వారిని కూడా భాగస్వాములను చేయాలి.
– కేబుల్ టీవీ ఆపరేటర్లు

వెల్లువలా వినతులు

వెల్లువలా వినతులు