
వ్యాన్ ఢీకొని యువకుడి దుర్మరణం
● జగనన్న కాలనీలో మోటార్ల చోరీకి వెళ్లిన దొంగల ముఠా
● స్థానికులు రావడంతో వ్యాన్‌లో పరారయ్యే క్రమంలో బైక్‌ను ఢీకొన్న దొంగలు
● దుండగులు టీడీపీ వర్గీయులు కావడంతో కాపాడే యత్నం
కోవూరు: మండలంలోని జమ్మిపాళెంలో ఉన్న జగనన్న కాలనీలో సబ్‌మెర్సిబుల్ మోటార్ల చోరీకి వ్యాన్‌లో వెళ్లిన దొంగల ముఠా స్థానికులు రావడంతో వ్యాన్‌తోసహా పరారయ్యే క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జమ్మిపాళెం సమీపంలో ఇటుకుల బట్టీ వద్ద జరిగింది. అయితే ఈ దొంగల ముఠా టీడీపీ వర్గీయులు కావడంతో వారిని కాపాడేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు.. జమ్మిపాళేనికి చెందిన మర్లపాటి సుధీర్‌బాబు (32)కు భార్య ముత్యాలమ్మ, ముగ్గురు పిల్లలున్నారు. అతను నెల్లూరులోని ఓ షాపింగ్ మాల్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో జమ్మిపాళెం మార్గంలో ఇటుకల బట్టీల వద్దకు వచ్చేసరికి అతడి బైక్‌ను పడుగుపాడు వైపు వస్తున్న టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొంది. దీంతో సుధీర్‌బాబు తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు కోవూరు ఎస్సై రంగనాథ్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రూ.2 లక్షలిస్తామని బేరాలు
ఈ ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ ప్రసాద్‌తోపాటు మణి, శ్రీహరి, మరో వ్యక్తి పడుగుపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు. వీరు ఇందుకూరుపేటకు చెందిన కోడూరు కమలాకర్‌రెడ్డికి ముఖ్య అనుచరులు. ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు ఆగకుండా వ్యాన్‌తో సహా పరారయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక టీడీపీ ముఖ్య నేతలు కొందరు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులపై ఒత్తిడి తేవడంతోపాటు ప్రైవేట్ పంచాయితీ పెట్టారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారంగా ఇస్తామని, కేసు లేకుండా చేయాలని ఒత్తిడి చేశారు. అయితే బాధిత కుటుంబం తరఫున మరో టీడీపీ నేత వచ్చి రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఈ పంచాయితీ సోమవారం రాత్రి వరకు తెగ లేదు. నిందితులు నలుగురూ స్థానిక టీడీపీ నేత ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
టీడీపీ నేతల దన్ను
నిందితులు టీడీపీ వర్గీయులు కావడంతో వారిని కాపాడేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థాయిలో పోలీసులపై ఒత్తిడి చేయిస్తున్నారని సమాచారం. రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితులు జమ్మిపాళెం సమీపంలో ఉన్న జగనన్న కాలనీవాసుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన బోర్లలోని సబ్‌మెర్సిబుల్ మోటార్లను చోరీ చేసేందుకు టాటా ఏస్ వ్యాన్‌లో వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు గమనించి అక్కడికి రావడంతో దుండగులు వ్యాన్‌తోపాటు పరారయ్యే క్రమంలో స్థానికులు వారిని వెంబడించడంతో అతి వేగంగా వెళ్తూ ఎదురుగా బైక్‌పై వస్తున్న సుధీర్‌బాబును ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిండు ప్రాణాన్ని బలిగొన్న దొంగల ముఠా టీడీపీ వర్గీయులు అని తెలియడంతో ఆ పార్టీ నేతలు వారిని కాపాడే ప్రయత్నం చేయడాన్ని స్థానికులు అసహ్యించుకుంటున్నారు.
జమ్మిపాళెంలో విషాదం
అందరితో కలివిడిగా ఉండే సుధీర్‌బాబు చనిపోవడంతో స్థానికులు కంటతడి పెడుతున్నారు. అతని భార్య, ముగ్గురు బిడ్డలు అనాథలు అయ్యారంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్‌బాబు తల్లి చెంచమ్మ అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తోంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.