
వేధిస్తున్నారు.. రక్షణ కల్పించండి
నెల్లూరు(క్రైమ్): పెళ్లికి అంగీకరించలేదన్న అక్కసుతో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ ఒకరు, కోర్కె తీర్చమని ఇంకొకరు, అసభ్యంగా ప్రవర్తిసూ మరొకరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రక్షణ కల్పించాలని బాధిత మహిళలు, యువతులు కోరారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య బాధితులతో మాట్లాడి ఆయా ప్రాంత పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. వేధింపులకు గురిచేస్తున్న వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలన్నారు. వివిధ సమస్యలపై 96 ఫిర్యాదులందాయి. కార్యక్రమంలో నగర, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీలు పి.సింధుప్రియ, చెంచురామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి, ఎస్‌బీ–2 ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● పెళ్లి చేసుకోవాలంటూ శశి అనే వ్యక్తి వేధిస్తున్నాడు. నేను నిరాకరించడంతో సోషల్ మీడియాలో నాపై అసభ్యకరమైన మెసేజ్‌లను బంధువులకు పంపిస్తున్నాడు. ఊర్లో, కళాశాల వద్ద అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. అతడి బారి నుంచి రక్షణ కల్పించాలని ఉలవపాడుకు చెందిన ఓ యువతి కోరారు.
● నా కుమార్తెతో చింటూ, సుధీర్, జయకృష్ణ అనే వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈనెల 20వ తేదీన ఆమె ఫొటోలు తీసి ఇబ్బంది పెడుతున్నారని దుత్తలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.
● కోర్కె తీర్చాలని, లేదంటే నా ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడతానని శివ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ మండలానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు.
● నా భార్య అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత వరకూ ఆమె జాడ తెలియరాలేదు. ఆచూకీ కనుక్కోవాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ వ్యక్తి కోరాడు.