
సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
నెల్లూరు(బారకాసు): మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నెల్లూరు నగరపాలక సంస్థ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బారాషహీద్ దర్గా గ్రౌండ్స్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నెల్లూరు నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి కె.పెంచల నరసయ్య, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్‌బీ మాట్లాడారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల పట్ల కూటమి ప్రభుత్వం వివక్షపూరిత ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. బ్యాంక్ రుణాలు కోరితే మీరు ఉద్యోగులు కాదని, రోజువారి కూలీలని చెప్పిన పాలకులు, కా ర్మికులకు వర్తింపజేసే సంక్షేమ పథకాలు తీసివేయడానికి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉద్యోగులుగా చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. 60 సంవత్సరాలు నిండాయనే నెపంతో ఏ రకమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా 93 మంది కార్మికులను అన్యాయంగా తొలగించారన్నారు. మంచినీటి సరఫరా వీధిలైట్లు తదితర పనులు నిర్వహించే ఇంజినీరింగ్ విభాగంలోని కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని తక్షణమే వారి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ధర్నా వద్దకు విచ్చేసిన కమిషనర్ వైఓ నందన్‌కు నాయకులు, కార్మికులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొండా ప్రసాద్, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కామాక్షమ్మ, మట్టిపాటి శ్రీనివాసులు, సుజాతమ్మ, లోకేష్ భాగ్యమ్మ, మనోజ్, జైకుమార్, షబ్బీర్, రాంబాబు, పందల శ్రీనివాసులు, దార్ల మాలకొండయ్య, బాలు, కొండమ్మ, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు.