
1 నుంచి ముఖ ఆధారిత హాజరు
వింజమూరు(ఉదయగిరి): రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ముఖ ఆధారిత హాజరును జూలై ఒకటి నుంచి అమలు చేయనున్నారని ఐసీడీఎస్ గుంటూరు రేంజ్ ఆర్జేడీ జయలక్ష్మి పేర్కొన్నారు. ప్రాజెక్ పనితీరుపై సీడీపీఓ, సూపర్‌వైజర్లతో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులొచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. సమయపాలన పాటించడంతో పాటు విధులకు ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆధార్ ఈ – కేవైసీని పోషణ్ యాప్‌లో ఈ నెల 30లోపు నూరు శాతం పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం కార్యాలయ అవరణలో మొక్కలు నాటారు. సీడీపీఓ పద్మజకుమారి, సూపర్‌వైజర్లు తేజశ్విని, సుహాసిని, నాగేశ్వరమ్మ, సుజాత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.