
కాల్ సెంటర్ ఏర్పాటు
నెల్లూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి వినతుల సమాచారం ప్రజలు తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజనల్ స్థాయిలో వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు తమ అర్జీ పరిష్కారం కాకున్నా, ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలియజేశారు.
నెల్లూరులో
యువత పోరు రేపు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఈనెల 23వ తేదీన జరగబోయే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున శనివారం ఒక ప్రకటనలో కోరారు. కూటమి ప్రభుత్వం యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. 23న పాత జెడ్పీ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు యువత, నిరుద్యోగులతో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించడం జరుగుతుందన్నారు.
ఎస్‌ఎస్‌సీ
నోటిఫికేషన్ జారీ
నెల్లూరు రూరల్: భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థల్లోని వివిధ గ్రూప్ బీ, సీ పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం ఓపెన్ కాంపిటిటీవ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ జారీ చేసిందని కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల వివరాలు, వయో పరిమితి, అవసరమైన విద్యార్హత, చెల్లించాల్సిన రుసుం, పరీక్ష పథకం, దరఖాస్తు చేసుకునే విధానం తదితర వివరాల కోసం కమిషన్ ssc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. జూలై 4వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించాలన్నారు. పరీక్ష ఆగస్ట్ 13 నుంచి 30వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఎస్సైల బదిలీలు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. అల్లూరు ఎస్సై కె.కిశోర్‌బాబును వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న ఎ.శ్రీనివాసరెడ్డిని అల్లూరుకు, కావలి రెండో పట్టణ ఎస్సై ఎన్.ప్రభాకర్‌ను బిట్రగుంటకు, బిట్రగుంట ఎస్సై కె.భోజ్యానాయక్‌ను వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న ఎస్.కోటయ్యను కలువాయి పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు.
బైక్ అదుపుతప్పి..
● యువకుడి మృతి
మర్రిపాడు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మర్రిపాడు పోలీసుల కథనం మేరకు.. ఏఎస్‌పేటు చెందిన షేక్ సమీర్ (18) మర్రిపాడు మండలంలోని డీసీపల్లి మజారా ఖాన్ సాహెబ్ పేట గ్రామంలోని దర్గాకు శుక్రవారం అర్ధరాత్రి బయలుదేరాడు. ఖాన్‌సాహెబ్‌పేట గ్రామానికి వచ్చేసరికి టర్నింగ్ వద్ద బైక్ అదుపుతప్పగా సమీర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సమీర్‌ను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మర్రిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ
రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శనివారం సాయంత్రం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకార మండపంలో తిరుచ్చిపై కొలువుదీర్చారు. ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్ర దీపాలంకరణ మండపంలో ఊంజల్‌సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం నిత్య కల్యాణ మండలపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని జరిపారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.30
సన్నవి : రూ.20
పండ్లు : రూ.10

కాల్ సెంటర్ ఏర్పాటు

కాల్ సెంటర్ ఏర్పాటు