
రేపు పీజీ జోనల్ సీఎంఈ ప్రోగ్రాం
నెల్లూరు(అర్బన్): ఈనెల 22వ తేదీన దర్గామిట్టలోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా పీజీ జోనల్ సీఎంఈ ప్రోగ్రాం నిర్వహిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం సర్వజన ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్‌లో డాక్టర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకో అనస్తీషియా, రీసెంట్ అడ్వాన్‌సెస్‌పై కొత్త పద్ధతులు, మెళకువలు, కొత్త పరిశోధనల గురించి చర్చించడం జరుగుతుందన్నారు. జోన్‌లో ఉన్నటువంటి అన్ని మెడికల్ కళాశాలల పీజీ విద్యార్థులు హాజరవుతారన్నారు. ఓవైపు ఆపరేషన్ థియేటర్‌లో చికిత్సలు అందిస్తూ మరో వైపు స్క్రీన్‌పై లైవ్‌లో కనిపించేలా పీజీ వైద్యులకు బోధన జరుగుతుందన్నారు. పీజీ చేస్తున్న వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, అనస్తీషియా విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.