
కాలకేయుల పాలన
ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నేతను భూస్థాపితం చేస్తామంటూ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నాడు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఆయన సుపుత్రుడు ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు అక్రమ అరెస్ట్‌లతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆ విధంగానే వైఎస్సార్‌సీపీ నేతలు, సానుభూతిపరులే లక్ష్యంగా పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి వారి ఆర్థిక మూలలపై దెబ్బ కొట్టే చర్యలకు దిగుతున్నారు. అధికార యంత్రాంగాలు సైతం వాస్తవాలతో పనిలేకుండా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చెబితే.. అదే చేస్తూ న్యాయ వివాదాలు సృష్టిస్తున్నారు. నిబంధనల మేరకు వైఎస్సార్‌సీపీ నేతలు ఏర్పాటు చేసిన లేఅవుట్లను ధ్వంసం చేసి నష్టపరుస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజాసంక్షేమాన్ని తుంగలో తొక్కేశారు. అభివృద్ధిని విస్మరించారు. మద్యం ఏరులై పారిస్తూ శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ సామాన్యుడి నుంచి మేధావుల వరకు నోరు మెదపకుండా అక్రమ కేసులతో వేధిస్తున్నారు. పథకాల గురించి ప్రశ్నించేవారిపై కుట్రలు చేస్తున్నారు. అధికారం చేజిక్కించుకుని ఏడాది దాటినా నారా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. అధికార యంత్రాంగాలు సైతం జీ హుజూరంటూ ఊడిగం చేస్తున్నాయి. కక్షలు, కుట్రలతో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. వైఎస్సార్‌సీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. వారి మౌఖిక ఆదేశాలే చట్టాలుగా భావించి పోలీస్, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు అమలు చేస్తున్నారు.
రికార్డులు పరిశీలించకుండానే..
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి నగరానికి సమీపంలోని కనుపర్తిపాడులో 2007లో స్థానిక రైతుల వద్ద దాదాపు 40 ఎకరాల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూముల్లోనే సర్వే నంబర్ 295లో 1.80 ఎకరాల భూమి కూడా రిజిస్ట్రర్ అయింది. అప్పటి నుంచి కూడా ఆదాల అధీనంలో ఆ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వన్ బీ అడంగళ్, పట్టాదారు పాసుపుస్తకం అన్నీ ఉన్నాయి.
రాజకీయ కక్షతోనే..
కనుపర్తిపాడులో ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డికి చెందిన ఆ భూమిని అహోబిలం మఠానికి చెందినది అంటూ స్థానిక వీఆర్వో, మఠానికి చెందిన వ్యక్తి గురువారం ఆ భూమిలో బోర్డు పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఇదంతా రాజకీయ కక్షతోనే జరిగిందని వైఎస్సార్‌సీపీ నేతలు మండి పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆ భూమిపై వివాదం ఉంటే స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తారు. సదరు రెవెన్యూ అధికారి నోటీసులు ఇచ్చి ఇరుపక్షాలను పిలిపించి వారి వద్ద ఉన్న రికార్డులను పరిశీలిస్తారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది పట్టా భూమిగా ఉంటే అందులో ఎవరూ ఏమీ చేయలేరు. ఒక వేళ ప్రభుత్వ భూమి అయి ఉంటే ఆ భూమి ఎలా వచ్చిందో నోటీసు జారీ చేస్తారు. సరైన ఆధారాలు చూపించకుంటే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా ఏకపక్షంగా ఆ భూమిలో బోర్డు పెట్టిడచడం చూస్తే ఇదంతా రాజకీయ కోణంతోనే జరిగిందని, అధికారులు నిబంధనలు ప్రకారం నడుచుకోలేదని వైఎస్సార్‌సీపీ వర్గీయులు మండి పడుతున్నారు. ప్రస్తుతం కనుపర్తిపాడులోని ఆదాల ప్రభాకర్‌రెడ్డికి చెందిన ఆ భూములు మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.70 లక్షల వరకు ధర పలుకుతోంది. కనుపర్తిపాడు గ్రామ శివారులో ఉన్న ఆ భూములు విలువ టీడీపీ అనుకూల పత్రికల్లో పాటు సోషల్ మీడియా గ్రూపుల్లో ఎకరం రూ.15 కోట్లు ఉందంటూ, మాజీ ఎంపీ ఆదాల భూమి కాజేశాడంటూ నిరాధారమైన ఆరోపణలతో కథనాలు ప్రచురించడం, వైరల్ చేస్తుండడం గమనార్హం.
రెడ్‌బుక్ అమలు
అంబేడ్కర్ రాజ్యాంగం అవహేళన
వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులే టార్గెట్
టీడీపీ ఎమ్మెల్యేల ఆదేశాలే చట్టాలు
2007లో కనుపర్తిపాడులో 40 ఎకరాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆదాల
అందులో కొంత మఠం భూమి
ఉందంటూ అధికారుల ప్రకటన
కొత్తూరు–అంబాపురంలో వైఎస్సార్‌సీపీ వర్గీయుల లేఅవుట్లు ధ్వంసం
కొత్తూరులో లేఅవుట్ ధ్వంసం
నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు–అంబాపురంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు దాదాపు 27 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. అందులో 17 ఎకరాల్లో వేసిన లేఅవుట్‌కు ప్రస్తుత ప్రభుత్వంలోనే మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. మిగిలిన 9 ఎకరాలకు అప్రూవల్ లేకపోవడంతో ఆ భూముల్లో ప్లాట్లు వేయకుండానే వదిలేశారు. అందులో రెండున్నర ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో మాత్రం గయాళ్‌గా చూపిస్తోంది. ఆ భూముల చుట్టూ ప్రహరీ నిర్మించారే కానీ ప్లాట్లు వేయలేదు. ప్రస్తుతం ఆ భూములు రైతుల అధీనంలోనే ఉన్నాయి. రాజకీయ కక్షతో పట్టాభూమిలో నిర్మించి ఉన్న ప్రహరీని కార్పొరేషన్ అధికారులు కొంత భాగం ధ్వంసం చేయడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇదంతా వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసేందుకు ఈ పరిణామాలు చేస్తున్నారని మండి పడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో దాదాపు 50 వరకు అనధికార లే అవుట్లు ఉన్నట్లు ఇటీవల ఽఅధికారులు గుర్తించారు. వాటి జోలికి వెళ్లకుండా కేవలం వైఎస్సార్‌సీపీ నేతలనే టార్గెట్ చేయడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.

కాలకేయుల పాలన